భారీ వానలకు రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలు ఆగమాగం

భారీ వానలకు రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలు ఆగమాగం

హైదరాబాద్/శంషాబాద్/ఎల్ బీనగర్/ వికారాబాద్, వెలుగు:సిటీ శివారులోని రంగారెడ్డి, వికారాబాద్ ​జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం  అర్ధరాత్రి పడిన వానకు బుధవారం ఉదయంపెద్ద గోల్కొండ బైరమోని చెరువు పొంగింది. ఓఆర్ఆర్ సర్వీసు రోడ్ మీదుగా వరద పారుతోంది. దీంతో పోలీసులు అటుగా రాకపోకలు బంద్ చేశారు. ఓర్ఆర్ఆర్ సర్వీస్ రోడ్డుతో పాటు, పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నంబర్–15 టోల్​గేట్​ను మూసివేశారు. పెద్ద గోల్కొండ నుంచి శంషాబాద్, తుక్కుగూడ వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడ్డారు. నాగారం, గొల్లపల్లి, శంషాబాద్, మహేశ్వరం, తుక్కుగూడ, సంఘీ, చిన్న గోల్కొండ గ్రామాలకు వెళ్లే దారులను పూర్తిగా క్లోజ్ చేశారు. పెద్దగోల్కొండ వద్ద వరద ప్రవాహం ఉండడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా ఓ లారీ డ్రైవర్ వాటిని తొలగించి  దాటే ప్రయత్నం చేశాడు. వరదలో లారీ పూర్తిగా మునిగిపోగా.. డ్రైవర్​తో పాటు  ఇద్దరు కూలీలు ప్రవాహంలో చిక్కుకున్నారు. ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ జితేందర్ రెడ్డి, ఓఆర్ఆర్ పెట్రోలింగ్ సిబ్బంది కలిసి లారీలోని వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వరద తగ్గేంత వరకు వాహనదారులు ఇటుగా ప్రయాణించొద్దని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో  ఇప్పటికే సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది సగటున 69.4 సెంటి.మీ నమోదు కావాల్సి ఉండగా జూన్ నుంచి ఇప్పటి వరకు సగటున 94.6 సెంమీ వాన కురిసింది. అక్టోబర్ నెలలో 9.4 సెంమీ సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, ఇప్పటికే 15.2 సెంమీ వర్షం పడింది. మంగళవారం రాత్రి కురిసిన వానకు ఇప్పటికే నిండుకుండల్లా ఉన్న చెరువులు ఒక్కసారిగా ఉప్పొంగాయి. 

మరో మూడ్రోజులు ఇంతే..
భారీ వర్షాలకు అబ్దుల్లాపూర్​మెట్ మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇబ్రహీపట్నం చెరువు పూర్తిగా నిండి  అలుగు పారుతుండడంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుంతపల్లి నుంచి మజీద్ పూర్, బాటసింగారం నుంచి మజీద్​పూర్ వెళ్లే రోడ్లు పూర్తిగా బంద్ అయ్యాయి. మరో రెండు, మూడు రోజులు ఇదే పరిస్థితి ఉండేలా కనిపిస్తోంది. వరుస వానలకు వికారాబాద్ జిల్లాలోని చాలా గ్రామాల్లోని వాగులు పొంగి నడుము లోతున పారుతున్నాయి. చాలా పంటలు దెబ్బతిన్నాయి. తాండూరు మండలం కరణ్​కోట్ రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో కాలేజీ స్టూడెంట్లు కొందరు బుధవారం ఆందోళనకు దిగారు. మరోవైపు పై నుంచి వరద ఆగకపోవడంతో ఉస్మాన్ సాగర్ 2, హిమాయత్ సాగర్ 2 గేట్లను ఎత్తిన అధికారులు నీటిని మూసీలోకి పంపుతున్నారు.