20 వేల ఎకరాల్లో పంట నష్టం.. వరద నీళ్లలో కొట్టుకుపోయిన వరి, తెర్లు అయిన పత్తి చేన్లు

20 వేల ఎకరాల్లో పంట నష్టం.. వరద నీళ్లలో కొట్టుకుపోయిన వరి, తెర్లు అయిన పత్తి చేన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పంటలకు అపారనష్టం జరిగింది. వివిధ దశలో ఉన్న పంటలు వరదనీటిలో మునిగాయి. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో పలు చోట్ల పంటలు కొట్టుకుపోయాయి. దీంతో రైతుల కష్టం, పెట్టుబడి వరద పాలైంది. కామారెడ్డి, మెదక్‌‌తో పాటు సంగారెడ్డి, సిద్దిపేట, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, జగిత్యాల, కరీంనగర్, యాదాద్రి తదితర జిల్లాల్లో పంటలపై తీవ్ర ప్రభావం పడినట్టు అధికారులు గుర్తించారు. 

దీంతో దాదాపు 20 వేలకు పైగా ఎకరాల్లో పంటలకు ఎఫెక్ట్‌‌ పడిందని ప్రాథమిక అంచనాలు ఉన్నాయి. గురువారం కొన్ని ప్రాంతాల్లో వర్షం తెరపి ఇవ్వడంతో అగ్రికల్చర్ అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పంట నష్టంపై వివరాలు సేకరించి వెంటనే నివేదిక ఇవ్వాలని అగ్రికల్చర్​ డైరెక్టర్ గోపిని మంత్రి ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అగ్రికల్చ్ ఎక్స్​టెన్షన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరిస్తున్నారు.

చీకట్లో పలు గ్రామాలు

భారీ వర్షాలకు విద్యుత్​పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తం అయి పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. పెద్ద సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో వాటిని తొలగించి, కొత్త పోల్స్, లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. వర్షాల ఎఫెక్ట్‌‌తో నార్నర్న్ డిస్కం పరిధిలో విద్యుత్తు వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో ముంపు గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. నార్తర్న్ డిస్కం పరిధిలోని కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ , నిజామాబాద్  సర్కిల్ పరిధిలో నేలకూలిన 108  కరెంటు స్తంభాలలో 87 పునరుద్ధరించామని, దెబ్బతిన్న ట్రాన్స్​ఫార్మర్లు 21 ఉండగా అందులో 17 సరిచేశామని చెప్పారు. 

86 ట్రాన్స్​ఫార్మర్లు నీటిలో మునిగిపోగా.. ఆరు పునరుద్ధరించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు బ్రేక్ డౌన్ టీంలు పనులు చేస్తున్నాయి. కరీంనగర్, జగిత్యాల, నిజామాబాదు ప్రాంతాలలో నార్తర్స్​డిస్కం సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పర్యటించారు. విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, ఉద్యోగులు నిరంతరం సబ్ స్టేషన్లు,  ట్రాన్స్​ఫార్మర్లు, లైన్లను పర్యవేక్షించాలన్నారు.

 ఏ ఒక్క ఉద్యోగి సెలవులపై వెళ్లవద్దని ఆదేశించినారు. సదరన్ డిస్కం పరిధిలో 33 కేవీ ఫీడర్లు 39, 11 కేవీ ఫీడర్లు 296, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌‌ఫార్మర్లు 280, విద్యుత్ స్తంభాలు 1,357 దెబ్బతిన్నాయి. మెదక్‌‌ జిల్లాలో కొన్ని సబ్‌‌స్టేషన్లలోకి వరద నీరు చేరడంతో 33 కేవీ ఫీడర్లు 11, 11 కేవీ ఫీడర్లు 175, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌‌ఫార్మర్లు 262, కరెంటు స్తంభాలు 971 దెబ్బతిన్నాయి. 

పలు జిల్లాల్లో భారీ నష్టం

ఈ ఏడాది  వానాకాలంలో 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ టార్గెట్‌‌ పెట్టుకుంది. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటికే 1.20కోట్ల ఎకరాల్లో పలు రకాల పంటలు సాగయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా తాజాగా కురిసిన భారీ వర్షాలతో చెరువులు తెగి, వాగులు పొంగడంతో వరదలు పంటలను ముంచెత్తుతున్నాయి. 

దీంతో ఆయాప్రాంతాల్లో పంటలకు భారీగా ఎఫెక్ట్‌‌ పడింది. ఇప్పటికే 20వేల ఎకరాల్లో పంటలపై ప్రభావం పడినట్టు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిరిసిల్ల నిజామాబాద్ తదితర జిల్లాల్లో వరి పొలాలు కొట్టుకుపోయాయి. ఇత పంటలపై కూడా భారీగా ఎఫెక్ట్ పడింది. పొలాల్లో నిలిచిన నీరంతా పోతే కానీ పంటల పరిస్థితి చెప్పలేమంటున్నారు.