కేరళలో వర్ష బీభత్సం.. 35 మంది మృతి

కేరళలో వర్ష బీభత్సం.. 35 మంది మృతి
  • 20 నుంచి 22 దాకా ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
  • ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు.. చాలా చోట్ల వరదల్లోనే జనం

పతనంథిట్ట: కేరళను భారీ వానలు వదలడంలేదు. వరదలు ఆగడంలేదు. మునిగిన ఊళ్లు.. బురదలో ఇండ్లు.. శిథిలాల కింద డెడ్ బాడీలు.. చాలా జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటిదాకా 35 మందికి పైగా చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గల్లంతైన అనేక మంది జాడ తెలియకపోవడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. కొట్టాయం, పతనంథిట్ట, ఇడుక్కి జిల్లాల్లో చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. చెట్లు కూలిపోయాయి. ప్రజలను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు. మరోవైపు మళ్లీ వాన భయపెడుతోంది. మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 20 నుంచి 22 దాకా కేరళలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

10 డ్యామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడ్ అలర్ట్

భారీ వర్షాలకు నదుల పరీవాహక ప్రాంతాల్లో నీటి స్థాయి పెరుగుతుండటంతో రాష్ట్రంలోని 10 డ్యామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడ్ అలర్ట్, మరో 8 డ్యామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కక్కి డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. శబరిమలలోని అయ్యప్ప దేవాలయ యాత్రను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి కె.రాజన్ తెలిపారు. ఈ నెల 20 నుంచి 24 దాకా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అందుకే ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.