కుండపోత.. నాలుగు రోజులుగా రికాం లేని వాన

కుండపోత..  నాలుగు రోజులుగా రికాం లేని వాన
  • కుండపోత..  నాలుగు రోజులుగా రికాం లేని వాన
  • హైదరాబాద్​లో ఎక్కడికక్కడ ట్రాఫిక్​ జామ్​
  • చెరువుల్లా మారిన రోడ్లు.. నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు 
  • భద్రాచలం వద్ద గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
  • జలదిగ్బంధంలో ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం
  • మరో 4 రోజులు వానలు.. హైదరాబాద్​లో రెండ్రోజులు సెలవులు

నెట్​వర్క్​, వెలుగు:  రాష్ట్రంలో వానలు దంచికొడ్తున్నాయి. నాలుగు రోజుల నుంచి రికాం లేకుండా వర్షాలు పడుతుండటంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. హైదరాబాద్​లో ఎక్కడికక్కడ ట్రాఫిక్​ జామ్​లు ఏర్పడి వాహనదారులు తిప్పలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ఊర్లలో పాత ఇండ్లు కూలిపోయాయి.  వరంగల్​ సిటీలో ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉపనదులు ఉప్పొంగుతుండడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. గురువారం మధ్యాహ్నం 3.19 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులు దాటగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్​ ప్రియాంక అలా  మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి వరద తీవ్రత నేపథ్యంలో భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి యంత్రాంగం అప్రమత్తమై, వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు ప్రారంభించింది. 

వాగులు పొంగి రాకపోకలు బంద్​ 

గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో  అత్యధికంగా 25.7 సెంటీ  మీటర్లు, వాంకిడి లో  11.6 సెంటీ  మీటర్ల  వర్షపాతం నమోదైంది.  సిద్దిపేట జిల్లా తొగుటలో 13.5, జగదేవ్ పూర్ లో 11.2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో  10,   భద్రాచలంలో 9.1,  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో 6.7,  మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో 7.1,   సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో  10. 8,  కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో  10,  గాంధారి మండలంలో  9.5 సెంటీమీటర్ల  వర్షపాతం రికార్డయింది. సిద్దిపేట జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. కోహెడ మండలంలో  మోయతుమ్మెద వాగు ఉధృతంగా  ప్రవహిస్తుండటంతో సిద్దిపేట, హన్మకొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జనగామ జిల్లా సరిహద్దులో రోడ్డు తెగిపోవడంతో జనగామ, సిద్దిపేట మధ్య రాకపోకలు బంద్​ అయ్యాయి.  సింగరాయ ప్రాజెక్టు,  సమ్మక్క , కిష్టమ్మ చెక్ డ్యామ్ లు పొంగిపొర్లుతున్నాయి.  మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని  కర్లాయి చెరువు మత్తడి దుంకుతున్నది. ఆకేరు, పాలేరు, మున్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కేసముద్రం, అర్పనపల్లి మధ్య వాగు ఉప్పొంగడంతో రాకపోకలను నిలిపివేశారు. కలెక్టరేట్​లో  హెల్ప్​లైన్​సెంటర్​ ఏర్పాటు చేశామని, వర్షాలు,  వరదలకు సంబంధించి  సమస్యలుంటే  7995074803 కు కాల్​ చేయాలని మహబూబాబాద్​ కలెక్టర్​ శశాంక సూచించారు. 

ఖమ్మం సిటీ పక్కన  మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది.  మెదక్​ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్ట్ పై నుంచి 9,237 క్యూసెక్కుల వరద  ప్రవహిస్తుండడంతో  ఏడుపాయల వనదుర్గామాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో కట్టుగూడెం, అబ్బుగూడెం  మధ్య రోడ్డుపైనుంచి ఎదుళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలను ఆపేశారు.  కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి దగ్గర  నిర్మిస్తున్న బ్రిడ్జి  వద్ద  వేసిన తాత్కలిక రోడ్డు కొట్టుకుపోయింది. ఆసిఫాబాద్​జిల్లా చింతలమనేపల్లి మండలం దిందా వాగు, ఆసిఫాబాద్ మండలం గుండి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాగజ్ నగర్ మండలం అందేవెల్లి వద్ద తాత్కాలిక రోడ్డు నీట మునిగి పోవడంతో కాగజ్ నగర్, -దహెగాం మండలాల్లో 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

వరంగల్​లో కాలనీలు జలమయం

భారీవర్షాలకు గ్రేటర్‍ వరంగల్​లోని ఎస్సార్ నగర్‍, సాయిగణేశ్‍ కాలనీ,  చాకలి ఐలమ్మ నగర్‍ జలమయమయ్యాయి. ఇండ్లల్లోకి వరద నీరు చేరడంతో టీవీ, ఫ్రిజ్‍, మంచాలు వంటి వస్తువులన్నీ పాడయ్యాయి. వంట చేసుకోడానికి వీల్లేకుండా ఉప్పుపప్పు తడిసిపోయాయి. దీంతో కాలనీల్లోని ప్రజలకు బుధవారం రాత్రంతా జాగారం తప్పలేదు. పలువురు బాధితులు ఇండ్లకు తాళాలు వేసి బంధువుల ఇండ్లకు వెళ్లారు. వర్షాలు మరో  రెండు మూడ్రోజులు కంటిన్యూ అయితే  గోపాల్‍పూర్‍, సమ్మయ్యనగర్‍, హంటర్​రోడ్​, ఎన్‍టీఆర్‍ తదితర కాలనీలను వరద నీరు  ముంచే ప్రమాదం​ ఉండడంతో జనం ఆందోళన చెందుతున్నారు. 

కరకట్ట స్లూయిజ్​లు మూసేయడం, రాత్రంతా వర్షం కురవడం, మోటర్లతో ఎత్తిపోయకపోవడంతో పట్టణంలోని రామాలయం పరిసరాలు, దుకాణాలు నీటమునిగాయి.  కామారెడ్డి జిల్లా హాస్పిటల్  ఆవరణ జలమయమైంది. పోస్టు ఆపరేషన్ వార్డులోని  పైకప్పు పీఓపీ కొంత భాగం ఊడి పడిపోయింది. అక్కడ  పెషేంట్లు లేకపోవటంతో ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ సెంటర్ లో పై కప్పు నుంచి వర్షం నీరు కురిసింది. దీంతో  పేషెంట్లు, స్టాఫ్ ఇబ్బందులు పడ్డారు.  మెదక్​ జిల్లా వెల్దుర్తిలో డబుల్ బెడ్ రూమ్ కాలనీలో  ఇళ్ల చుట్టూ నీళ్లు నిలిచాయి. స్టేషన్ మాసాయిపేట వద్ద  అసంపూర్తిగా ఉన్న  రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షం నీరు నిలిచిపోవడంతో కొప్పుల పల్లి, బొమ్మారం, నాగ్సాన్ పల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజాంపేట, రామాయంపేట  తహసీల్దార్ ఆఫీసుల్లో   పైకప్పు నుంచి  నీరు కురుస్తుండటంతో సిబ్బంది గిన్నెలు పెట్టారు. సంగారెడ్డి, కంగ్టి, దెగుల్ వాడీ, నాగూర్, చాప్టా, సర్దార్ తండా, ముకుంద నాయక్ తండా, సుక్కల్ తీర్థ్, దామర్ గిద్ద గ్రామాల్లో భారీ వర్షానికి చాలాఇండ్లు  నేల మట్టమయ్యాయి. 
    
నిరంతరంగా కురుస్తున్న వానలతో సింగరేణి వ్యాప్తంగా గురువారం దాదాపు 71,764 ట న్నుల బొగ్గు ఉత్పత్తికి, 13,78,180 క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ పనులకు బ్రేక్ పడింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని  సీతారాంపురం గ్రామంలో వాంతులు,  విరేచనాలతో గురువారం ఉదయం కుర్సం బాబురావు(30) చనిపోయాడు. అదే గ్రామానికి చెందిన కుర్సం చిన్న లక్ష్మయ్య (25) సీరియస్ గా ఉండడంతో గ్రామస్తులు డోలి సాయంతో కుంకుమ మడుగు వాగు దాటించి హాస్పిటల్​కు తీసుకెళ్లారు. 

హైదరాబాద్​లో రోడ్లు జలమయం

హైదరాబాద్, వెలుగు: ఎడతెరిపి లేని వానలతో హైదరాబాద్​లో జనజీవనం స్తంభించిపోయింది. గురువారం తెల్లవారుజామున నుంచి నగరంలోని అన్నిప్రాంతాల్లో వాన దంచికొట్టింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. కుత్భుల్లాపూర్ లోని వోక్షిత్ ఎన్​ క్లేవ్ తో పాటు మరో రెండు కాలనీల్లో నడుంలోతు నీరు ప్రవహించడంతో జనం బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.  షేక్ పేట్, కుత్భుల్లాపూర్ లోని దూలపల్లి తదితర ప్రాంతాల్లో ఇండ్లలోకి వర్షపునీరు చేరింది. ముషీరాబాద్, కవాడీగూడ, బేగంబజార్ ప్రాంతాల్లో మూడు పురాతన భవనాలు కూలాయి. రోడ్లపై అంతా నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నీటిని క్లియర్ చేసేవారు లేకపోవడంతో గంటల తరబడి రోడ్లపై నీరు అలాగే నిలిచింది. ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ వద్ద  నడుంలోతు నీరు చేరడంతో  రాకపోకలు నిలిచిపోయాయి. చార్మినార్​ ప్రభుత్వ యునాని​ఆస్పత్రి మొదటి అంతస్తు నుంచి ఉరుస్తుండటంతో పలు వార్డుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది.  వర్షాలతో ప్రజల ప్రాణాలకు గాని, వారి ఆస్తులకు గానీ ఎలాంటి నష్టం జరుగకుండా చూడాలని అధికారులను టెలీకాన్ఫరెన్స్​లో  హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి  ఆదేశించారు. 

మరో 4 రోజులు వానలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని గురువారం బులెటిన్‌‌లో పేర్కొంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఆదిలాబాద్, కరీంనగర్, యాదాద్రి, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు గురువారం రాష్ట్రంలో చాలాచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ప్రత్యేకించి వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌‌నగర్, మేడ్చల్, మెదక్, హైదరాబాద్‌‌లలో భారీ వర్షపాతం నమోదైంది.