రెండో రోజూ దంచికొట్టిన వాన... హైదరాబాద్ సిటీలో పొద్దంతా ముసురే

రెండో రోజూ దంచికొట్టిన వాన... హైదరాబాద్ సిటీలో పొద్దంతా ముసురే
  • కుమ్రంభీమ్, ములుగు, కరీంనగర్ జిల్లాల్లో కుండపోత
  • ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ప్రవాహాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వరుసగా రెండో రోజూ వర్షాలు దంచికొట్టాయి. రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ, అతి భారీ వర్షాలతో దాదాపు లోటు వర్షపాతమంతా కవర్ అయిపోయింది. బుధవారం రాత్రి పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, ములుగు, కరీంనగర్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే అత్యంత భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కుమ్రం భీం జిల్లా బెజ్జూరులో 23.7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. 

ములుగు జిల్లా వెంకటాపురంలో 21.9 సెంటీ మీటర్లు, కరీంనగర్ జిల్లా పోచంపల్లిలో 14.5, కరీంనగర్​లో 12.6, ములుగు జిల్లా మంగపేటలో 12.5, మల్లంపల్లిలో 11.9, కరీంనగర్ జిల్లా మంగిపల్లిలో 11.6, హనుమకొండ జిల్లా మరిపల్లిగూడెంలో 11.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. బుధవారం నాటి వర్షాలు.. గురువారం కూడా కొనసాగడంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో అధికారులు హై అలర్ట్ లో ఉన్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

సిటీలో ముసురే.. 

గురువారం మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ముసురు కమ్మేసింది. హైదరాబాద్ సిటీలో మోస్తరు వర్షాలు పడ్డాయి. ముషీరాబాద్ లో 1.9 సెంటీమీటర్లు, విద్యానగర్ లో 1.7, బంజారాహిల్స్ లో 1.6, అంబర్​పేట, నాంపల్లిలో 1.5 సెంటీమీటర్ల మేర వర్షపాతం రికార్డ్ అయ్యింది. కాగా, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా ఆంధ్ర తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం.. అందులో విలీనం అయినట్టు పేర్కొంది. దీని ప్రభావంతో వర్షాల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. అయితే, వారం పాటు ఇంకా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

కృష్ణ ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద..

ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా పరీవాహకంలో వరదలు కొనసాగుతున్నాయి. కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ తో పాటు జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు కూడా నిండిపోయాయి. వరద ఇలాగే కొనసాగితే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కూడా మరో రెండు మూడు రోజుల్లో నిండే అవకాశాలున్నాయి. 

ప్రస్తుతం జూరాలకు 62 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. అంతే దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 80 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా లక్షన్నర క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉన్నది. సాగర్ ప్రాజెక్టుకు 1.21 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. అయితే, గోదావరి ప్రాజెక్టులకు మాత్రం ఇంకా వరద రాకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. 

ప్రాజెక్టుల్లో వరద.. కెపాసిటీ వివరాలు..

ప్రాజెక్టు             సామర్థ్యం     ప్రస్తుత నిల్వ    ఇన్ ఫ్లో          అవుట్ ఫ్లో 

                       (టీఎంసీల్లో)     (టీఎంసీల్లో) (క్యూసెక్కుల్లో) (క్యూసెక్కుల్లో)

ఆల్మట్టి              129.72                  103.57                 42,500              42,500

నారాయణపూర్    37.64    36.61    45,000    54,140

జూరాల    9.66    9.01    71,000    88,980

తుంగభద్ర    105.79    78.14    24,397    27,474

శ్రీశైలం    215.81    205.22    79,983    1,54,566

సాగర్    312.05    272.72    1,21,049    14,263

నిజాంసాగర్    17.8    4.07    000    000

సింగూరు    29.91    19.41    2,114    243

శ్రీరాంసాగర్    80.5    21.37    1,500    608

ఎల్లంపల్లి    20.18    9.2    5,285    452

మిడ్ మానేరు     27.5    6.88    573    110

కడెం    4.7    3.66    2,527    861