- మక్కలు కాపాడుకునేందుకు రైతుల పాట్లు
వెలుగు, నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు చేతికొచ్చిన పంటలు దెబ్బతింటున్నాయి. శనివారం సాయంత్రం కురిసిన ఆకస్మిక వర్షానికి కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో వడ్లు, మక్కలు నీటిపాలయ్యాయి. కండ్ల ముందే చేతికొచ్చిన పంట నేలపాలవుతుంటే రైతులు గుండెలు బాదుకున్నారు.
మెదక్ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా కేంద్రం శివారు పిల్లికొటాల్, డబుల్ బెడ్రూం కాలనీ, మెదక్ మండలం శివ్వాయిపల్లి, మల్కాపూర్ తండా తదితర కొనుగోలు కేంద్రాలతో పాటు కొల్చారం మండలం రాంపూర్ వద్ద నేషనల్ హైవేపై ఆరబోసిన వడ్లు తడిశాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుతో పాటు దుబ్బాక, తొగుట, బెజ్జంకి, కోహెడ, హుస్నాబాద్, చేర్యాల, జగదేవ్ పూర్ మండలాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం నీటిపాలైంది.
సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, మునిపల్లి, కోహీర్, జహీరాబాద్, రాయికోడ్, న్యాల్కల్, నారాయణఖేడ్, నాగలిగిద్ద కొనుగోలు కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలోనూ కల్లాల్లో ఆరబెట్టిన వడ్లు, కొనుగోలు సెంటర్లలో వడ్ల బస్తాలు తడిశాయి. యాదాద్రి జిల్లాలో వర్షం కారణంగా వరి కోతలు, పత్తి తీసే పనులు ఆగిపోయాయి.
వాన భయానికి పత్తి కొనుగోళ్లు ప్రారంభించడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పత్తి, మొక్కజొన్న, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొక్కజొన్నకు మొలకలు వస్తుండగా, పత్తి కాయలు కుళ్లిపోతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేతికొచ్చే దశలో పంటలు దెబ్బతింటున్నాయి. చేన్లలో నీళ్లు నిలిచి పత్తి నల్లబడుతోంది.
ఈదురు గాలులకు వందల ఎకరాలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల కూరగాయల తోటలూ ధ్వంసం కావడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. పలుచోట్ల టార్పాలిన్లు లేకపోవడంతో పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక తల్లడిల్లుతున్నారు. అలాగే, శనివారం కురిసిన వర్షానికి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు చేరి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా చందానగర్ లో 5.65 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. చందానగర్‌లోని గంగారం, గచ్చిబౌలి హెసీయూ గేట్ 2 వద్ద ముంబై నేషనల్ హైవేపై భారీగా నీరు చేరింది. లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కింది నుంచి రాకపోకలు బంద్ అయ్యాయి.
గచ్చిబౌలిలోని జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసు ఎదుట సుదర్శన్‌నగర్ నీటమునిగింది. ఓ బైకు కొట్టుకుపోయింది. రాయదుర్గం మల్కం చెరువు వద్ద ఖాజగూడ నుంయి షేక్‌పేట వరకు రహదారిపై భారీగా చేరిన నీటిని మోటార్ల సాయంతో తొలగించారు. గచ్చిబౌలి ఐఐఐటీ, విప్రో జంక్షన్లు, డీఎల్ఎఫ్గేట్ వద్ద వరద చెరువును తలపించింది. హైడ్రా, డీఆర్ఎఫ్ మాన్సున్ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి.
