బ్యాంక్​లోకి వరద.. 400 కోట్లు నీటిపాలు

బ్యాంక్​లోకి వరద..  400 కోట్లు నీటిపాలు

సెప్టెంబర్​లో నాగ్​పూర్​ను ముంచెత్తిన వర్షాలు
బ్యాంక్  ఆఫ్  మహారాష్ట్ర బ్రాంచ్​ను ముంచెత్తిన వరద
తాజాగా బయటపడిన వీడియో

నాగ్​పూర్: సెప్టెంబర్ 23న పడిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు మహారాష్ట్రలోని నాగ్​పూర్​ను ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాల ఇండ్లతోపాటు సీతాబుల్డిలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జోనల్ ఆఫీస్ కూడా నీట మునిగింది. బ్యాంక్ కౌంటర్ల దాకా వరద రావడంతో కోట్లాది రూపాయల కరెన్సీ నోట్లు తడిసి ముద్దయ్యాయి. ఈ ఘటనలో ఏకంగా రూ.400 కోట్లు నీళ్లపాలైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు బయటపడటంతో మంగళవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, దీనిపై మాట్లాడేందుకు బ్యాంక్  అధికారులు నిరాకరించారు. 

డబ్బు ఎంత పాడైందో చెప్తలేరు.. 

బ్యాంక్ క్యాష్  కౌంటర్లదాకా నీళ్లు వచ్చాయన్న విషయాన్ని, నగదు తడిసిందనే విషయాన్ని మేనేజర్ వైభవ్ కాలే ధృవీకరించలేదు, ఖండించనూలేదు. బయటపడిన వీడియోలో మాత్రం.. నోట్ల కట్టలన్నీ వరదనీళ్లలో మునుగుతున్నట్లు కనిపించింది. సిబ్బంది అంతా ఏమీ చేయలేని పరిస్థితిలో చూస్తూ ఉండిపోయారు. అనంతరం, యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన మున్సిపల్ సిబ్బంది.. నీళ్లను మోటార్ పంపులు ద్వారా బయటికి పంపించివేసేందుకు ఒకరోజుకుపైగా సమయం పట్టింది. డబ్బంతా తడిసిన విషయాన్ని మాత్రం బ్యాంక్ అధికారులు ఆర్బీఐకి నివేదించగా.. పరిస్థితిని సమీక్షించేందుకు స్పెషల్ టీమ్​ను పంపారని సమాచారం. తడిసిన నోట్లను లెక్కించి, అందులో పూర్తిగా పాడైన వాటిని ధ్వంసం చేశాక.. పాడైన నోట్లను బ్యాంకుకు ఆర్బీఐ తిరిగి చెల్లిస్తుంది. లెక్కల్లో తేడాలొస్తే మాత్రం బ్యాంకే తిరిగి ఆర్బీఐకి చెల్లించాల్సి ఉంటుందని అధికారవర్గాలు చెప్తున్నాయి.