వచ్చే 4 రోజులు పెద్ద వానలు

వచ్చే 4 రోజులు పెద్ద వానలు
  • ఇయ్యాల కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే చాన్స్ 
  • ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం 
  • కొత్తగూడెంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఈ నెల 6 నుంచి 12 మధ్య అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, రాష్ట్రంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు భారీ వానలు పడ్డాయి. చాలాచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు పూర్తిస్థాయిలో నిండిపోయాయి. వానలకు అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిని, ఊర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. 

వచ్చే నాలుగు రోజులు పెద్ద వానలు 

నల్గొండ జిల్లాలోని మునుగోడు–-చండూరు మధ్య ప్రయాణాలు బంద్ అయ్యాయి. హైదరాబాద్ లో కురిసిన భారీ వానకు చాలా కాలనీలు జలమయమయ్యాయి. కొత్తగూడెం టౌన్​లో 13 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా చండూరులో 11, సిద్దిపేటలోని వర్గల్, ములుగులోని తాడ్వాయిలో 10, రంగారెడ్డిలోని ఇబ్రహీంపట్నం, మేడ్చల్, శామీర్​పేట్​లో 8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఈ సీజన్​లో సాధారణం కన్నా 28 శాతం ఎక్కువ వానలు పడ్డాయి. రెండు జిల్లాల్లో అతి భారీ, 21 జిల్లాల్లో భారీ, 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది.