హైదరాబాద్, వెలుగు: బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడ్రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. దీంతో ఆది, సోమ, మంగళవారాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. కుమ్రంభీం జిల్లాలోని దహేగాంలో 12 సెంటీమీటర్లు, సిర్పూర్(టి)లో 10, వాంకిడిలో 6, బెజ్జూర్‌లో 6, మంచిర్యాలలోని భీమిని, కోటపల్లి, కుమ్రంభీంలోని కాగజ్‌నగర్, వనపర్తిలో 5 సెం.మీ. చొప్పున వర్షపాతం రికార్డయ్యింది.
