బంగాళాఖాతంలో అల్పపీడనం..రెండ్రోజులపాటు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం..రెండ్రోజులపాటు భారీ వర్షాలు
  • రాష్ట్రమంతటా చురుగ్గా రుతుపవనాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రాష్ట్రంలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వర్షాల ప్రభావం ఉంటుందని చెప్పింది. ఆదివారం దక్షిణ తెలంగాణలోని నాలుగైదు జిల్లాలు మినహా రాష్ట్రమంతటా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి. ఆదిలాబాద్​ జిల్లా నార్నూర్​లో అత్యధికంగా 3.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా సిర్పూర్​ టీలో 3.6, సిద్దిపేట జిల్లా మిర్​దొడ్డిలో 3.5, నిజామాబాద్​ జిల్లా కల్దుర్కిలో 2.7, గద్వాల జిల్లా భీమవరం, నారాయణపేట జిల్లా క్రిష్ణలో 2.5 సెంటీమీటర్లు, నర్వలో 2.2, ఆసిఫాబాద్​లో 2.1 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. హైదరాబాద్​లో కాప్రా సర్కిల్​లో 1.5 సెంటీమీటర్ల వాన పడింది. మల్కాజ్​గిరిలో 1.4, గాజుల రామారంలో 1.3 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. 

ఇప్పటిదాకా భారీగా లోటు వర్షపాతం

రాష్ట్రంలో ఇప్పటిదాకా లోటు వర్షపాతమే నమోదైంది. పడాల్సిన దానిలో సగమే కురిసింది. ఈ నెల ప్రారంభం నుంచి ఈపాటికల్లా 103.2 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్​ కావాల్సి ఉన్నా.. 50.6 మిల్లీమీటర్ల మేరనే నమోదైంది. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నాలుగు జిల్లాల్లో తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ లోటు నుంచి తీవ్ర లోటు వర్షపాతం రికార్డయింది. ఆదిలాబాద్​, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్​, నిజామాబాద్​, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్​భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, కరీంనగర్​, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, ములుగు, ఖమ్మం జిల్లాల్లో తీవ్ర లోటు వర్షపాతం ఉండగా.. మహబూబాబాద్​, వరంగల్​, మెదక్​, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్​, మేడ్చల్​ మల్కాజ్​గిరి, మహబూబ్​నగర్​, జోగులాంబ గద్వాల, వనపర్తి, సూర్యాపేట జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతమే రికార్డయింది. వర్షాలు లేక చాలా జిల్లాల్లో రైతులు వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తలేదు. మరికొన్ని జిల్లాల్లో ఇంకా నాట్లు పడలేదు. ఇప్పుడిప్పుడే రైతులు నారుపోసేందుకు సిద్ధమవుతున్నారు.