ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలకు నష్టపోతున్న రైతులు

 ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలకు నష్టపోతున్న రైతులు
  • ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలతో నష్టపోతున్న రైతులు 
  • వరద నీరు, ఇసుక మేటలతో ఎదగని పంటలు 
  • పత్తి, సోయా, పెసరకు తీవ్రనష్టం
  • పత్తికు తెగుళ్లు, పింక్ బౌల్ ఎఫెక్ట్​
  • ఆందోళనతో ఇద్దరు రైతుల ఆత్మహత్య


ఆదిలాబాద్, భైంసా, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లా రైతులను భారీ వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. జులై రెండో వారం నుంచి పడుతున్న వానలతో సీజన్ ​ప్రారంభం నుంచే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో సమయానికి వానలు పడటంతో రైతులు సాగు పనులు మొదలు పెట్టారు. ఆ తర్వాత ప్రారంభమైన వానలతో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. భారీ వర్షాలకు నీటమునిగిన పంటలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. దీంతో పంటలు ఎదగక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల వ్యవధిలో ఆదిలాబాద్​జిల్లా గుడిహత్నూర్​కు చెందిన పోతురాజుల సత్యనారాయణ (35), నిర్మల్​జిల్లా ముథోల్ మండలం ఎడ్​బిడ్​ గ్రామానికి చెందిన మంగారపు లక్ష్మణ్​(38) ఇద్దరు రైతులు దెబ్బతిన్న పంటను చూసి ఆత్మహత్య చేసుకున్నారు. 

లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు..

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో ఈ సీజన్​లో వివిధ రకాల పంటలు మొత్తం 18లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. నిరుడు జిల్లాలో పత్తికి రికార్డు స్థాయి ధర రూ. 13వేలు పలకడంతో ఈ సీజన్​లో రైతులు ఎక్కువగా పత్తి వైపే మొగ్గు చూపారు. అత్యధికంగా 11లక్షల ఎకరాల్లో పత్తి, 3.50లక్షల ఎకరాల్లో వరి, 1.50లక్షల ఎకరాల్లో సోయా, లక్ష ఎకరాల్లో కంది, 10వేల ఎకరాల్లో మిర్చి పంటలు సాగయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పత్తి, సోయా, పెసర, వరి పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 10 లక్షల ఎకరాల్లో పత్తి, సోయా, కంది, ఇతర పంటలు దెబ్బతిన్నాయని అగ్రికల్చర్​ఆఫీసర్లు అంచనా వేశారు. కొన్ని చేలల్లో ఇసుక మేటలు, వరద నీటితో పంటలు ఎదగలేని స్థితిలో ఉన్నాయి. కొన్ని భూములైతే సాగుకు పనికి రాకుండా పోయాయి. జిల్లాలోని కడెం, గడ్డెన్న, స్వర్ణ, చనఖా కొరటా బ్యారేజీ, పెన్​ గంగా వంటి ప్రాజెక్టుల నుంచి వచ్చిన వరదలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వర్షాలు తగ్గినా తాము సాగు చేయలేమని రైతులు వాపోతున్నారు. నిర్మల్​జిల్లాలో చాలా మంది రైతులు కూరగాయలు సాగు చేయగా అవి కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. కౌలు రైతుల పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది. 

పత్తి దిగుబడిపై ఎఫెక్ట్​

భారీ వర్షాలతో పత్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ ఏడాది ఒక్క ఆదిలాబాద్​జిల్లాలోనే 3.90 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేశారు. గతేడాది పంట దిగుబడి రాక ఇబ్బందులు పడ్డ రైతులకు ఈ ఏడాది పంట మొదట్లోనే నష్టం చవిచూడాల్సి వచ్చింది. ఎడతెరపిలేని వర్షాలతో మొక్కలు ఎదగలేదు. ఆగస్టు మొదటి వారం వరకు మోకాళ్ల వరకు ఎత్తు పెరగాల్సిన మొక్కలు ఫీట్​ఎత్తు కూడా పెరగలేదు. దీంతో ఈ ఏడాది పత్తి ఎకరానికి మూడు క్వింటాళ్ల వరకు దిగుబడులు తగ్గిపోతాయని వ్యవసాయ అధికారులు, రైతులు చెబుతున్నారు. గతంలో ఎకరానికి కనీసం 8 నుంచి 10 క్వింటాళ్లు దిగుబడి వచ్చేది. రెండేళ్ల నుంచి అది కాస్తా 7 క్వింటాళ్లకు పడిపోయింది. ఈ ఏడాది ఆ మాత్రం కూడా వచ్చే అవకాశం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరద ఎఫెక్ట్​లేని చేలు కూడా ఆకులు ఎర్రబడుతున్నాయి. దీంతో పింక్​బౌల్, ఇతర తెగుళ్లు వ్యాపిస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పత్తి సాగుకు ఎకరానికి రూ.25వేల వరకు ఖర్చు చేశామని, పంటలు నీటమునగడం, ఆకులు ఎర్రబడుతుండటంతో ఆ పెట్టుబడి అంతా వృథాయేనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గతేడాది పత్తి ధర బాగానే ఉన్నా దిగుబడి తగ్గడంతో రైతులు నష్టపోయారు. ఈసారైనా దిగుబడి పెరుగుతుందేమోనని ఆశపడిన రైతుకు వానల రూపంలో నిరాశే ఎదురవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇంకా తొలగని ముప్పు

ఇంకా వాన ముప్పు తొలగనే లేదు. మరిన్ని వానలు పడుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్​, నిర్మల్​, మంచిర్యాల, ఆసిఫాబాద్​ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్​అలర్డ్​ ప్రకటించింది. మహారాష్ట్రతో పాటు ఇక్కడ కురుస్తున్న వానలతో గోదావరి నది, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా.. చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. 

పత్తి పంట ఎదుగుదల ఆగిపోయింది.. 

ఈ ఏడాది తొమ్మిది ఎకరాల్లో పత్తి పంట వేశాను. చేను ఎదుగుతుందనే దశలో వరుస వానలతో పంట ఎదుగుదల ఆగిపోయింది. పంట దెబ్బతినడంతో ఎకరానికి ఐదు క్వింటాళ్లు కూడా దిగుబడి వచ్చే అవకాశం లేదు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. - గవ్వల సాయి చైతన్య, రైతు గిర్నూర్ 

పంటంతా నీటమునిగింది... 

ఈ యేడు సీజన్​లో నాకున్న ఐదెకరాల్లో సోయా సాగు చేసిన. ఎకరానికి రూ. 10వేల దాకా ఖర్చు చేసిన. ఈ వానలతో నాలుగెకరాల పంటంతా వాన నీటిలో ఉంది. సుమారు పది రోజులు నీళ్లలోనే ఉంది. ఈ పంట ఎదిగేలా లేదు. రూ. 50వేల దాకా నష్టం జరిగింది. - తిప్ప నరేందర్​, రైతు, కస్రా, కుభీర్​ మండలం

మూడెకరాల్లో అంతటా ఇసుకే..

నాకున్న పది ఎకరాల్లో వరి సాగు చేశాను. మూడెకరాల్లో పొలం ఇసుక మేటలతో నిండిపోయింది. ఆ ఇసుకను తీసే పరిస్థితి లేదు. వర్షాలు తగ్గినా పంట సాగు చేయడం కష్టమే. నాలాంటి చాలా మంది రైతులది ఇదే పరిస్థితి.  - కొత్తురు చిన్నన్న, రైతు, కన్కాపూర్​ లోకేశ్వరం మండలం.