
- రాష్ట్రమంతా మస్తు వానలు
- ప్రాజెక్టులకు వరద
- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు
- భూపాలపల్లి జిల్లాలో కొన్ని గ్రామాలకు రాకపోకలు బంద్
- ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
- మరో నాలుగు రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్ / నెట్‌వర్క్, వెలుగు: రాష్ట్రమంతటా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు అనేక ప్రాంతాల్లో మోస్తరు, అంతకన్నా ఎక్కువ వానలు పడ్డాయి. దీంతో పలు జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కోణంపేట వాగు ఉధృతితో కొన్ని అటవీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరులోని ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. కర్నాటకలోని మహాబలేశ్వరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద వస్తున్నది. గోదావరి బేసిన్‌లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. మేడిగడ్డ వద్ద ప్రాణహిత పరవళ్లు తొక్కుతున్నది. దుమ్ముగూడెం ఆణకట్టకు సుమారు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే నీటిని కిందికి వదిలేస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండడంతో ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ఫ్లడ్ సీజన్‌లో మొదటిసారిగా మేడిగడ్డకు ఎగువన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కొంతమేరకు వరద వస్తున్నది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న నాలుగు రోజులపాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా.. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని అంచనా వేసింది. జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. టీఎస్‌డీపీఎస్ డేటా ప్రకారం 24 గంటల్లో నిజామాబాద్ జిల్లాలోని మెండోరలో 11సెం.మీ., నల్గొండలోని డిండిలో 10.4, సంగారెడ్డిలోని కంగ్తిలో 10.1, నాగర్‌కర్నూల్‌లోని తోటపల్లిలో 9.5, మహబూబ్‌నగర్‌లోని కొత్త మొల్గరలో 9, ఆదిలాబాద్‌లోని చాప్రాలలో 8.8, నిర్మల్‌లోని లక్ష్మణ్‌చందాలో 8.5 సెం.మీ. చొప్పున వర్షపాతం రికార్డయింది.
ఎస్సారెస్పీ గేట్లకు వేగంగా రిపేర్లు
ఎస్సారెస్పీకి మంగళవారంతో పోలిస్తే వరద తగ్గింది. 5 వేల క్యూసెక్కుల వరద వచ్చి ప్రాజెక్టులో చేరుతున్నది. 90.31 టీఎంసీలకు గాను బుధవారం నాటికి 28.49 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. లోకల్ క్యాచ్‌మెంట్‌తో పాటు మహారాష్ట్రలో వానలు కురుస్తుండటంతో ప్రాజెక్టుకు వరద పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు గేట్ల రిపేర్లు వేగంగా చేస్తున్నారు. నిరుడు భారీ వరదలు ముంచెత్తినా 11 గేట్లు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. దీంతో మొత్తం 42 గేట్ల రిపేర్లు గత నెల 19న ప్రారంభించారు. ఐరన్ రోప్ తెగిపోవడంతో నిరుడు గేట్లు తెరుచుకోలేదని, ఇతర టెక్నికల్ సమస్యలు ఉండటంతో రూ.17.40 కోట్లతో రిపేర్లు చేస్తున్నామని ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీనివాస్ తెలిపారు.
ప్రాజెక్టులకు వరద
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డకు 43 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 30 గేట్లు ఎత్తి 66 వేల క్యూసెక్కులు నదిలోకి వదిలేస్తున్నారు. ఈ బ్యారేజీలో 16.17 టీఎంసీలకు గాను 5.96 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టుకు 5,740 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఒక గేటు ఎత్తి 6,501 క్యూసెక్కులు కిందికి వదిలేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మొత్తం ముసురుపట్టింది. ఎల్లంపల్లిలోకి 5,267 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ఈ ప్రాజెక్టులో 20.18 టీఎంసీలకు 10.02 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సుందిళ్ల బ్యారేజీకి 5,278 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నది. ఈ బ్యారేజీలో 8.23 టీఎంసీలకు గాను 5.29 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అన్నారం బ్యారేజీకి 8,500 క్యూసెక్కుల వరద వస్తున్నది. 10.87 టీఎంసీలకు గాను 6.97 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాణహితకు ఇంద్రావతి పరవళ్లు తోడవడంతో సమ్మక్క సాగర్‌కు 91,500 క్యూసెక్కుల వరద వస్తోంది. బ్యారేజీ గేట్లు ఎత్తి అంతే నీటిని నదిలోకి వదిలేస్తున్నారు. ఈ బ్యారేజీలో 6.94 టీఎంసీలకు 1.09 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి.
కృష్ణా బేసిన్‌లో...
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. భూత్పూర్ మండలంలో 8.64 సెం.మీ, జడ్చర్లలో 7.95 సెం.మీ. వర్షం కురిసింది. కోయిల్కొండ, గండీడ్, హన్వాడ, దేవరకద్ర, మూసాపేట, నవాబ్‌పేట, బాలానగర్, రాజాపూర్, మిడ్జిల్, మహ్మదాబాద్ మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని దుందుభి వాగుకు వరద మొదలైంది. కల్వకుర్తిలో 3.99 సెం.మీ., నాగర్ కర్నూల్‌లో 2.64, అచ్చంపేటలో 1.52 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. కర్ణాటకలోని మహాబళేశ్వరం ప్రాంతంలో భారీ వర్షాలకు ఆల్మట్టికి 42 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ఈ ప్రాజెక్టులో 129.72 టీఎంసీలకు 55.03 టీఎంసీల నీళ్లు చేరాయి. తుంగభద్ర డ్యాంకు వరద పెరిగింది. 34,075 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. 100.86 టీఎంసీలకు 52.99 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఎగువన భారీ వర్షాలతో ఈ ప్రాజెక్టులకు వరద పెరగొచ్చంటున్నారు. రాష్ట్రంలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొద్దిపాటి వరద వస్తున్నది.
బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. కూసుమంచి మండలంలో 5.5 సెం.మీ, వేంసూరులో 4.4 సెం.మీ, పెనుబల్లిలో 4.1 సెం.మీ వర్షం కురిసింది. వర్షాలతో సత్తుపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తికి ఆంటకం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్నది. దమ్మపేట మండలంలో 4 సెంటీమీటర్లు, చర్ల మండలంలో 3.8, కొత్తగూడెంలో 3.4, పాల్వంచలో 3.2, పినపాకలో 3, మణుగూరులో 2.5 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. భారీ వర్షాలతో కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. కిన్నెరసాని ప్రాజెక్టుకు 1,400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 15 అడుగులకు చేరింది. రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తోన్న భారీ వర్షాలతో దుమ్ముగూడెం (సీతమ్మసాగర్) వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. సుమారు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే నీటిని కిందికి వదిలేస్తున్నారు.
అటవీ గ్రామాలకు రాకపోకలు బంద్
భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కోణంపేట వాగు పొంగిపొర్లుతుండటంతో మహాముత్తారం మండలంలోని అటవీ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వాగు దాటలేక మోడల్ స్కూల్ విద్యార్థులు ఇండ్లకు తిరిగి వెళ్లిపోయారు. మహదేవపూర్, మల్హర్, మహాముత్తారం, భూపాలపల్లి మండలాల్లో 6 సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది.