ఢిల్లీలో 8.5 సెంటీమీటర్ల వర్షం

ఢిల్లీలో 8.5 సెంటీమీటర్ల వర్షం

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చాలా చోట్ల మోకాలు లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునగగా.. అండర్ పాసుల్లోకి సైతం వరద నీరు ప్రవేశించింది. గత 24 గంటలకలె  వివిధ ప్రాంతాల్లో 7 నుంచి 8.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం.. రోడ్లు కనిపించకుండా ఎటుచూసినా వాన నీరు ప్రవహిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. ప్రజలు భయం భయంగా.. మోకాళ్ల లోతు నీళ్లలోనే ప్రయాణాలు చేస్తున్నారు.

10ఏళ్లలో రికార్డు స్థాయి వర్షం

గత పదేళ్ల కాలంలో అక్టోబర్ నెలలో ఈ స్థాయి భారీ వర్షలు ఎన్నడూ కురవలేదు. ఢిల్లీ మహానగరంతోపాటు చుట్టుపక్కల  ఉన్న నోయిడా, గుర్ గ్రామ్ తదితర ప్రాంతాల్లో కూడా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా 10 డిగ్రీలకు పడిపోయింది. చలికాలం ప్రారంభం కావడానికి నెల రోజుల సమయం ఉన్నా.. అప్పుడే చలికాలం మొదలైనట్లు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఇవాళ కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సోమవారం వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో మంచు వర్షం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మంచు వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చమోలి జిల్లాలో విపరీతంగా మంచు కురుస్తోంది. హేమకుండ్ సాహిబ్ ప్రాంతం అంతా మంచు దుప్పటిలా మారింది. ఇళ్లు, రోడ్లపై పెద్ద ఎత్తున మంచు పేరుకుపోయింది. ఎడతెరిపిలేని వర్షాలకు తోడు మంచు వర్షంతో  జన జీవనం స్తంభించిపోయింది. మంచు పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో ఇళ్లలో నుంచి బయటకు రావడానికి ప్రజలు ఇబ్బందులు పడ్తున్నారు.