నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు

నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు
  • సూర్యాపేటలో పలు కాలనీలు, రోడ్లు జలమయం
  • లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన వరద నీరు
  • ధర్మారం - లక్ష్మీదేవి కాల్వ గ్రామాల మధ్య రాకపోకలు బంద్

నల్గొండ: ఉమ్మడి నల్గొండ  జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న  వర్షాలతొ  సూర్యాపేట పట్టణంలోని కొన్ని కాలనీలు,  రోడ్లు జలమయం అయ్యాయి. మానస నగర్, స్నేహనగర్ ప్రాంతాల్లో వరదనీరు చేరడంతో  కాలనీవాసులు  ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి  వరద నీరు రావడంతో  జనం అవస్థలు పడుతున్నారు. వాన నీరు స్వేచ్ఛగా ప్రవహించే అవకాశం లేకుండా.. నాలాలు ఆక్రమించుకొని ఇండ్లు కట్టడంతో ఈ  పరిస్థితి ఏర్పడిందంటున్నారు  సూర్యాపేట  వాసులు. మున్సిపల్ కమిషనర్ కు ఎన్నిసార్లు చెప్పినా  పట్టించుకోవడం లేదంటున్నారు. కేవలం ఒక్కసారి భారీ  వర్షం పడితే  చాలు కాలనీలు నీట మునిగే పరిస్థితి ఉందంటున్నారు. వెంటనే  మున్సిపల్ అధికారులు  స్పందించి వరద నీటిని క్లియర్ చేసేలా చర్యలు  తీసుకోవాలంటున్నారు.

ఎడ తెరిపి లేకుండా నిన్న రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు భారీ వర్షపాతం నమోదు అయింది. సూర్యాపేట జిల్లాలో  ఆత్మకూర్ (ఎస్)  మండలంలో 19 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే తుంగతుర్తిలో 14 సెంటీమీటర్లు, నడిగూడెంలో 13, మద్దిరాలలో 11,  నాగారంలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం  నమోదు అయింది. నకిరేకల్ లో 9 సెం.మీ, నల్గొండలో 7, కేతేపల్లిలో 7,  శాలిగౌరారంలో 7, తిప్పర్తిలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షం పాతం నమోదు అయింది. అలాగే యాదాద్రి జిల్లా అడ్డగుడూర్ మండలంలోని  పలు గ్రామాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ధర్మారం చెరువు  అలుగు పోస్తుండటంతో  ధర్మారం - లక్ష్మిదేవి కాల్వ  గ్రామాల మధ్య నిలిచిపోయిన  రాకపోకలు నిలిచిపోయాయి.