భార్యభర్తలపై పిడుగు.. భార్య మృతి, భర్త సీరియస్

భార్యభర్తలపై పిడుగు.. భార్య మృతి, భర్త సీరియస్

జగిత్యాల రూరల్/బయ్యారం/ఇందల్వాయి/డిచ్​పల్లి/ వెలుగు: జగిత్యాల, నిజామాబాద్​ జిల్లాల్లో మంగళవారం పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఈ రెండు జిల్లాల్లో ఇద్దరు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల జిల్లా రూరల్ ​మండలం పెంబట్ల కోనాపూర్‌‌కు చెందిన జోగిని పద్మ, భర్త గంగమల్లు తమ పొలంలో పని చేసుకుంటుండగా ఈదురు గాలులతో వర్షం పడింది. ఆ సమయంలోనే పిడుగు పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. పక్కనున్న రైతులు వారిని జగిత్యాల జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించగా పద్మ చనిపోయింది. తీవ్రంగా గాయపడిన గంగమల్లుకు ట్రీట్‌మెంట్​ చేస్తున్నారు.

అలాగే మహబూబాబాద్​ జిల్లా బయ్యారం మండలం ఉప్పలపాడుకు చెందిన చెబెల్లి చిన్న వెంకన్న(53) వ్యవసాయ పనుల కోసం మిరపతోటకు వెళ్లాడు. మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో గాలి వాన రావడంతో పక్కనే ఉన్న చెట్టు కిందికి పరిగెత్తాడు. అదే టైంలో పిడుగుపడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య లింగమ్మ, కొడుకులు కోటేశ్, కుమారస్వామి ఉన్నారు.

నిజామాబాద్ ​జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో ఇండ్ల మధ్య ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. జోరు వానలోనూ చెట్టుపై మంటలు చెలరేగాయి. డిచ్​పల్లి మండలం యానంపల్లిలోని పెద్దమ్మ ఆలయ శిఖరంపై పిడుగు పడి శిఖరం ధ్వంసమైంది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.