రాష్ట్రంలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జలదిగ్బంధం

రాష్ట్రంలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జలదిగ్బంధం

నైరుతి తిరోగమన టైంలోనూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు పోతు పోతు కుండపోత వానలు కురిపిస్తున్నాయి. దీనికి తోడు.. ద్రోణి ఎఫెక్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో నిన్న రాత్రి మరోసారి కుండపోత వాన పడింది. భారీగా కురిసిన వర్షానికి హైదరాబాద్ బోరబండలోని ఓ కాలనీలో వరద పోటెత్తింది. ఎగువ కాలనీల నుంచి కొన్ని కార్లు కొట్టుకొచ్చాయి. రోడ్లపై పార్కింగ్ చేసిన బైక్ లు కొట్టుకుపోయాయి. కొన్ని ఇండ్లలోని ఫర్నీచర్ కొట్టుకుపోయింది. కొంపల్లి, చింతల్ లోని 12 కాలనీలు వరదలో చిక్కుకున్నాయి. దూలపల్లిలోని తుమ్మర్ చెరువు, లింగయ్య చెరువు.. గుండ్ల పోచంపల్లిలోని గుండ్ల చెరువులు అలుగులు పోస్తున్నాయి. వరద నీరు రోడ్లపైకి చేరడంతో మేడ్చల్, కొంపల్లి రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

మహబూబ్ నగర్ జిల్లా..

జిల్లాల్లోనూ వర్షం దంచికొట్టింది. కుండపోత వర్షానికి మహబూబ్ నగర్ అతలాకుతలమైంది. కాలనీలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. వర్షపు నీటి ప్రవాహంతో మెయిన్ రోడ్లు చెరువులయ్యాయి. వర్షంతో జనజీవనం స్తంభించింది. వర్షపు నీరు చుట్టుముట్టడంతో స్థానిక కలెక్టరేట్ చెరువును తలపించింది. కలెక్టరేట్ ఆవరణలో కారులో చిక్కుకున్న ఇద్దరిని స్థానికులు రక్షించారు. బస్టాండ్ దగ్గర ఎస్బీఐ బ్యాంకుతో పాటు ఏటీఎంలోకి వర్షపు నీళ్లు చేరాయి. బ్యాంకులో ఫర్నీచర్ సహా వస్తువులు వర్షంలో తడిసిపోయాయి.

పాలమూరు జిల్లా..

ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి పాలమూరులోని లోతట్టు ప్రాంతాలు వరదలోనే ఉన్నాయి. పెద్దచెరువు దిగువ ప్రాంతాలైన రామయ్య బౌలి, బీకే రెడ్డి కాలనీ, శివశక్తి నగర్ ప్రాంతాలలో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. సుభాష్ నగర్, బస్టాండ్.. కలెక్టరేట్ ప్రధాన మార్గం పూర్తిగా వాగును తలపించింది. పెద్ద చెరువు శిఖం భూముల కబ్జా, నాలాల ఆక్రమణతో వర్షం పడిన ప్రతిసారి లోతట్టు ప్రాంతాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. చెరువు పనులు త్వరగా పూర్తిచేసి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. 

నాగర్ కర్నూల్ జిల్లా..

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోనూ ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. బస్టాండ్ , టెలిఫోన్ ఎక్స్చేంజ్ ప్రాంతాల్లో నీరు చేరడంతో  రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.  బిజినేపల్లి, మహదేవన్ పేట  ప్రాంతాల్లోనూ పంటలు దెబ్బతిన్నాయి. కొల్లాపూర్ నియెజకవర్గంలోని నార్లాపూర్ దగ్గర పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటేందుకు జనం ఇబ్బంది పడుతున్నారు.

మెదక్ జిల్లా..

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రాత్రి కురిసిన వర్షానికి భారి వర్షపాతం నమోదవుతోంది. రెండు ముడు రోజులుగా కురుస్తున్న వానలకు పంటలు పాడవుతున్నాయని.. పత్తి చేన్లలో నీరు చేరడంతో దిగుబడి తగ్గుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.