భారీ వర్షాలు.. తడిచి ముద్దైన తెలంగాణ.. జిల్లాల్లో ఇదీ పరిస్థితి

భారీ వర్షాలు.. తడిచి ముద్దైన తెలంగాణ.. జిల్లాల్లో ఇదీ పరిస్థితి

తెలంగాణ పల్లెలు భారీ వర్షానికి తడిచి ముద్దైయ్యాయి. సెప్టెంబర్ 3 తెల్లవారు జామునుంచి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వానల ప్రభావంతో పలు జిల్లాలు చిగురుటాకులా వణికాయి.

నిర్మల్ జిల్లాలో భారీగా కమ్ముకున్న కారుమబ్బులతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకా.. పట్టపగలే వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలో ఇళ్లలోకి వర్షపు, మురుగు నీరు చేరి ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. 

పెద్దపల్లి జిల్లాలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్ మండలాల్లో వర్షం దంచికొడుతోంద. వరద నీరు భారీగా వచ్చి చేరి మంథని బస్ స్టాప్ స్విమ్మింగ్ పూల్ ని తలపిస్తోంది. మంచిర్యాల స్టేట్ హైవే వెల్గటూర్ సొసైటీ కార్యాలయం ముందు చెట్టు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు స్పందించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. 

ప్రాణాలకు తెగించి కరెంట్ సరఫరా పునరుద్ధరించిన లైన్ మెన్..

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డివిజన్ రూరల్ సెక్షన్ చెల్పూర్ లో కురిసిన వర్షానికి చెరువు మధ్యలో పోల్ పై డిస్క్ ఫెయిల్ అవ్వడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న జూనియర్ లైన్ మెన్ అంబాల వెంకటేశ్వర్లు తన ప్రాణాలు పణంగా పెట్టి చెరువు మధ్యలో ఉన్న స్తంభం దగ్గరికి ఈదుకుంటూ వెళ్లాడు. 

స్తంభం ఎక్కి డిస్క్ మార్చి గ్రామానికి కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లును ప్రజలు అభినందించారు.