
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి శనివారం వాయుగుండంగా మారిందని తెలిపింది. శనివారం అర్ధరాత్రి తుఫానుగా మారి, ఆదివారం కళింగపట్నం వద్ద తీరం దాటే చాన్స్ ఉందని పేర్కొంది. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మామకన్నులో 12.2 సెం.మీ, ఆదిలాబాద్‌లోని ఇచ్చోడలో 3.7, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగా పూర్‌లో 2.9 సెం.మీ. చొప్పున వర్షపాతం రికార్డయ్యింది.