జోరందుకున్న వానలు

జోరందుకున్న వానలు
  • మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • పలు చోట్ల కరెంట్​ సరఫరాకు అంతరాయం
  • తొర్రూరులో ఎక్కువగా 8.9 సెంటీమీటర్ల వర్షం
  • మరో మూడు రోజులు వానలు.. 30న అల్పపీడనం

హైదరాబాద్​, వెలుగు: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు జోరందుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్​లో భారీ వర్షం కురిసింది. మంగళవారం కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. ఇంకొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల కరెంట్​ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా తొర్రూరు గ్రామపంచాయతీ పరిధిలో ఎక్కువగా 8.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలోని కీసరలో 6.6 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లాలోని తొమ్మిదిరేకులలో 5.83 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్​, యాదాద్రి భువనగిరి, జనగాం, మెదక్​, సిద్దిపేట, వరంగల్​ రూరల్​, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోనూ వర్షాలు చెప్పుకోదగ్గ స్థాయిలో పడ్డాయి. ఖమ్మంలో ఎక్కువగా 38.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పు మధ్య అరేబియా సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ మహారాష్ట్ర ప్రాంతాల్లో, తమిళనాడు తీరానికి దగ్గర నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఈనెల 30న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.