
- కన్నీటి వరద
- 24 గంటల్లోనే ఆరుగురు మృతి.. ఇద్దరు గల్లంతు
- పది రోజుల్లో 38 మంది మృతి
- ఇండ్లు కూలి కొందరు.. కొట్టుకపోయి ఇంకొందరు
- భారీ వర్షాలకు పంట నష్టపోయి రైతు ఆత్మహత్య
- ప్రజలను అలర్ట్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్
- ఇంకా పొంచి ఉన్న గోదావరి వరద ముప్పు
- భయాందోళనలో పరీవాహక ప్రాంత ప్రజలు
- రాష్ట్రంలో ఇయ్యాల, రేపు భారీ వర్షాలు
నెట్‌వర్క్, హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. పంటలను ముంచెత్తుతున్నాయి. తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. వానలకు ఇండ్లు కూలిపోయి, వరదల్లో కొట్టుకపోయి పది రోజుల్లో 38 మంది చనిపోయారు. వర్షాలు, వరదలపై ప్రజలను అలర్ట్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని, తమ గోసను పట్టించుకునే దిక్కు లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నా.. గోదావరికి వరద ముప్పు ఇంకా పొంచి ఉన్నా సర్కారు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా భద్రాద్రితో పాటు ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పునరావాస కేంద్రాలను కూడా ఎత్తేసింది. దీంతో వరద బాధితులు అందరూ విధిలేక తమ ఇండ్లలోకి వెళ్తున్నారు. మళ్లీ వరదలు వచ్చి ప్రాణనష్టం జరిగితే బాధ్యులు ఎవరనే ప్రశ్నలు వస్తున్నాయి. ‘ప్రాణనష్టం లేకుండా జాగ్రత్త పడ్డాం’ అని ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించినా.. నష్టం ఎక్కువగానే జరిగింది. పునరావాస శిబిరాలు వెంటనే ఎత్తివేయవద్దని కేసీఆర్ భద్రాచలంలో చెప్పిన మాటలు కూడా చెల్లుబాటు కాలేదు.
తెల్లవారితే ఎంగేజ్‌మెంట్.. ఇంతలోనే
దుగ్గొండి మండలం రేబల్లెకు చెందిన తిప్పారపు పైడయ్య అలియాస్ పైడి(55).. వరంగల్ మండిబజార్‌లో కడుతున్న బిల్డింగ్ వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. ఖమ్మంలోని వైఎస్సార్ నగర్‌కు చెందిన ఎండీ సలీమా అలియాస్ సమ్మక్క.. పైడయ్య పని చేసే బిల్డింగ్ వద్ద కూలి పనులు చేసుకుంటున్నది. ఇద్దరూ అక్కడే గుడిసె వేసుకుని ఉంటున్నారు. సలీమా కొడుకు ఎండీ ఫిరోజ్ (24) తన ఎంగేజ్‌మెంట్ కోసమని తల్లిని ఇంటికి తీసుకెళ్లేందుకు శుక్రవారం ఉదయం వరంగల్ వచ్చాడు. సాయంత్రం ముగ్గురూ కలిసి భోజనం చేశాక అదే గుడిసెలో నిద్రపోయారు. శనివారం ఎంగేజ్‌మెంట్ ఉండటంతో తెల్లవారే వాళ్లిద్దరూ ఊరికి వెళ్లాల్సి ఉంది. పక్కనే డంగుసున్నంతో కట్టిన పురాతన బంగ్లా ఉంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసి శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. స్లాబ్‌తోపాటు గోడలు పక్కనే ఉన్న గుడిసెపై పడ్డాయి. దీంతో ఫిరోజ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పైడయ్య, సలీమాకు తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ పైడయ్య చనిపోయాడు. సలీమా పరిస్థితి విషమంగా ఉంది.
గోడ కూలి ఇద్దరి మృతి
మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లిలోని శ్రీ లక్ష్మీ గణేశ్ మినరల్స్ కంపెనీలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి గోడ కూలి ఇద్దరు కార్మికులు చనిపోయారు. బీహార్‌కు చెందిన రన్ బెన్ యాదవ్ (50), వికారి యాదవ్(45), దినేశ్ దాస్ , గౌతమ్ యాదవ్.. శ్రీ లక్ష్మీ గణేష్ మినరల్స్‌లో కూలీలుగా పని చేస్తున్నారు. వారు కంపెనీ ఆవరణలోనే రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి రేకుల షెడ్డుకు ఒక వైపు ఉన్న మట్టి గోడ కూలి నిద్రిస్తున్న వాళ్లపై పడింది. దీంతో రన్ బెన్ యాదవ్, వికారి యాదవ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. దినేశ్‌దాస్, గౌతమ్ యాదవ్‌లకు గాయాలయ్యాయి.
వరద నీటిలో స్కిడ్అయ్యి..
మెదక్ జిల్లా నార్సింగి వద్ద హైవేపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో బైక్ స్కిడ్ అయ్యి ఓ యువకుడు చనిపోయాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాగేపూర్‌కు చెందిన తోకల సాయిలు (19) విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఏజెంట్ అరుణ్‌తో కలిసి మెడికల్ టెస్ట్ కోసం నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
మడుగులో పడి ఆరేండ్ల బాలిక మృతి
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని గురుజ్ గ్రామంలో వాన నీటి మడుగులో పడి ఆరేండ్ల చిన్నారి చనిపోయింది. గురుజ్‌కు చెందిన సలాం ప్రభాకర్ కూతురు అక్షిత (6) శుక్రవారం తల్లిదండ్రుల వెంట చేనుకు వెళ్లింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చేను పక్కనే ఉన్న మడుగు పూర్తిగా నిండింది. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల్లో ఉండగా, బాలిక కనిపించకుండా పోయింది. చీకటిపడే దాకా వెతికిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాలించగా.. చేను పక్కనే ఉన్న మడుగులో చిన్నారి మృతదేహం దొరికింది.
వాగుల్లో ఇద్దరు గల్లంతు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామానికి చెందిన పల్లె యాకయ్య (58) అనే రైతు శనివారం వాగులో కొట్టుకపోయాడు. భారీ వర్షాలకు గ్రామ శివారులోని గుర్తూరుకు వెళ్లే రోడ్డులో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు సమీపంలోనే యాకయ్య పొలం ఉంది. నీట మునిగిన పొలాన్ని పరిశీలించేందుకు వాగు దాటేందుకు యత్నించగా కొట్టుకపోయాడు. యాకయ్య కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్ గాలిస్తోంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని కూడవెళ్లి వాగులో గుర్తుతెలియని వ్యక్తి కొట్టుకపోయాడు.
హైదరాబాద్‌లో నీళ్లలోనే కాలనీలు.. జనం ఇక్కట్లు
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు అనేక కాలనీలు నీటిలోనే ఉన్నాయి. సూరారం పెద్దచెరువు ఓవర్ ఫ్లో అవడంతో దిగువన ఉన్న కాలనీల్లోకి నీరు చేరాయి. దీంతో జనం ఇబ్బందులు పడ్డారు. నాగోల్ అయ్యప్ప కాలనీ, బేగంపేట్ మయూరి మార్గ్, లింగంపల్లి, నిజాంపేట్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఆనంద్ బాగ్, నాగారం, కూకట్ పల్లి, మల్కాజిగిరి, కుషాయిగూడ తదితర ప్రాంతాల్లోని కాలనీల్లో నీరు చేరింది. శుక్రవారం రాత్రి బంధువులు, తెలిసిన వారి ఇండ్లలో తలదాచుకున్నట్లు స్థానికులు చెప్పారు. మయూరిమార్గ్, అయ్యప్పకాలనీ, నిజాంపేట్, కుత్బుల్లాపూర్ తదితర కాలనీల్లో బయట నడవలేని పరిస్థితి ఏర్పడింది. లింగంపల్లి రైల్వే బ్రిడ్జి కింద పూర్తిగా నీరు నిలిచిపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. వర్షాలు కురిసిన ప్రతిసారి ఇబ్బంది పడుతున్నామని మంత్రి కేటీఆర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు అధికారులపై జనం ఫైర్ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. అత్యవసరమైతే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 040‑21111111 లేదా 040‑29555500 నంబర్లతోపాటు డయల్ 100కి కాల్ చేయవచ్చని ఆఫీసర్లు సూచించారు.