గట్టివాన.. ఆగమైన సిద్ధిపేట

గట్టివాన.. ఆగమైన సిద్ధిపేట

మాట్లాడితే  ‘‘మా సిద్దిపేట.. మా డెవలప్​మెంట్​.. మా రోల్​ మోడల్​..’’ అంటూ ప్రభుత్వ పెద్దలు తరుచూ చెప్తుంటారు. కానీ ఆదివారం కురిసిన ఒక్క వానకు సిద్దిపేట టౌన్​ ఆగమైంది. కాలనీలు నీటమునిగాయి. రోడ్ల పొంట ఎక్కడ చూసినా మోకాళ్ల లోతు నీళ్లు ఉండటంతో జనం నరకం అనుభవించారు. కొత్తగా కట్టిన డబుల్​బెడ్​రూం ఇండ్ల సీలింగ్​లు కారి,  రూముల్లోకి  నీళ్లు చేరాయి. గోడల్లోంచి ఊట మొదలైంది. ఇండ్ల లోపల, బయట నీళ్లు చేరడంతో లబ్ధిదారులకు రాత్రంతా నిద్రపోకుండా పారలు చేతపట్టుకొని నీళ్లు మలుపుకుంటూ కనిపించారు. రూ. 271 కోట్లు పెట్టి కట్టిన అండర్​గ్రౌండ్​ డ్రైనేజీ అసంపూర్తిగా, అస్తవ్యస్తంగా మారడంతో డ్రైన్లు పొంగి పొర్లాయి. 

సిద్దిపేట, వెలుగు: ‘మా సిద్దిపేట.. మా డెవలప్​మెంట్​.. మా రోల్​ మోడల్​.. ’ అంటూ ప్రభుత్వ పెద్దలు తరుచూ చెప్తుంటారు. కానీ ఆదివారం ఒక్కరోజు కురిసిన వానకు ఈ మోడల్​ టౌన్​ కాస్తా ఆగమైంది.  రూ.271 కోట్లు పెట్టి కట్టిన అండర్ ​గ్రౌండ్​ డ్రైనేజీ అసంపూర్తిగా, అస్తవ్యస్తంగా మారడంతో డ్రైన్లు పొంగి పొర్లాయి. రోడ్లు వరద కాలువలయ్యాయి. వర్షానికి గతంలో మునిగిన కాలనీలతోపాటు, కొత్తగా మరిన్ని కాలనీల్లోకి మోకాళ్లలోతు నీళ్లు చేరి జనం నానాపాట్లు పడ్డారు. సిద్దిపేటలో కొత్తగా కట్టిన డబుల్​ బెడ్​రూం ఇండ్ల సీలింగ్​లు కారి,  గదుల్లోకి నీళ్లు చేరాయి. గోడల్లోంచి ఊట మొదలైంది. దీంతో లబ్ధిదారుల కొత్త ఇండ్ల మురిపం కొద్దిరోజుల్లోనే ఆవిరైంది. ఇండ్ల లోపల, బయట నీళ్లు చేరడంతో లబ్ధిదారులు రాత్రంతా నిద్రపోగొట్టుకొని.. పారలు పట్టుకొని నీళ్లు మలుపుకున్నారు. 

యూజీడీ చాంబర్ల నుంచి ఎగజిమ్మిన నీళ్లు..

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అమృత్ స్కీంలో భాగంగా రూ.271 కోట్లతో సిద్దిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టారు. ఈ క్రమంలో పాత డ్రైన్లను నిర్లక్ష్యంగా వదిలేశారు. వీటిలో చాలాచోట్ల సిల్ట్ పేరుకుపోవడం, కొన్నిచోట్ల వాటిని పూర్తిగా మూసి వేయడంతో కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. యూజీడీలో భాగంగా నర్సాపూర్ వద్ద నిర్మిస్తున్న సీవరేజ్ ట్రీట్​మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) పనులు ఇంకా పూర్తికాలేదు. 11 ఎంఎల్​డీ కెపాసిటీతో నిర్మిస్తున్న ఈ ఎస్టీపీ కంప్లీట్​ కాకపోవడంతో  భారత్ నగర్, శివాజీ నగర్, హైదరాబాద్ ​రోడ్డు, శ్రీనివాస నగర్ ప్రాంతాల్లోని 14 వేల  ఇండ్ల నుంచి వచ్చే  మురుగు నీటిని మళ్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో యూజీడీ పైపుల్లో నీటి ఒత్తిడి ఎక్కువై చాంబర్ల నుంచి మురుగునీరు వీధుల్లోకి ఎగజిమ్మింది.  గతంలో ఎన్నాడూ లేని విధంగా  పట్టణంలోని భారత్​నగర్, బారాయిమామ్, నాసర్ పురా, శివాజీ నగర్, గణేశ్​​నగర్, ఎన్సాన్ పల్లి రోడ్డు, హైదరాబాద్​ రోడ్డు తదితర ఏరియాల్లో కాలనీల్లోకి వరద నీరు పోటెత్తింది. అలాగే చాలా ఇండ్ల ల్లోకి వర్షపు నీరు చేరింది. భారీ వర్షానికి రోడ్లన్నీ కాలువల్లా మారడంతో నాసర్​పురాలోని  పలు ఇండ్లల్లోకి నీళ్లు చొచ్చుకెళ్లాయి. పట్టణ చరిత్రలో మొదటిసారి నలువైపులా వరద నీరు చుట్టుముట్టడంతో ప్రజలు నానా పాట్లు పడ్డారు. మున్ముందు భారీ వర్షాలు పడితే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

దిగబడుతున్న రోడ్లు.. 

అండర్ ​గ్రౌండ్​ పనులు పూర్తయ్యాక సీసీ రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. పైపులైన్​ వేసిన గుంతలను పూడ్చకపోవడంతో ఆదివారం కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ మడుగులయ్యాయి. భారత్ నగర్, శివాజీ నగర్​లాంటి చోట్ల వెహికిల్స్​ దిగబడుతున్నాయి. యూజీడీ చాంబర్ల వద్ద సిమెంట్​పనులు పూర్తి చేయకపోవడంతో కూలే ప్రమాదం ఉందని జనం భయపడుతున్నారు. ఇన్నాళ్లూ నిర్లక్ష్యంగా ఉన్న ఆఫీసర్లు సోమవారం హడావిడిగా రిపేర్లు మొదలుపెట్టారు.

ఉరుస్తున్న డబుల్​ బెడ్​ రూం ఇండ్లు

రాష్ట్రానికే ఆదర్శం అన్నట్లుగా బిల్డప్​ ఇచ్చిన సిద్దిపేట డబుల్​బెడ్​రూం ఇండ్లలోని డొల్లతనం ఒక్క వానకే బయటపడ్డది. ‘కేసీఆర్ నగర్ ’ పేరిట అపార్ట్​మెంట్ల తరహాలో నిర్మించిన ఈ డబుల్​ బెడ్​రూం ఇండ్లన్నీ ఉరుస్తున్నాయి. సీలింగ్  పై నుంచి నీళ్లు కారడంతో పలు ఇండ్లలోని సామగ్రి తడిసింది. కొన్ని ఇండ్లలో నీళ్ల కింద బిందెలు, బకెట్లు పెట్టాల్సి వచ్చింది. స్లాబ్ లో క్వాలిటీ లోపాల వల్లే ఉరుస్తున్నాయని ఇటీవలే గృహప్రవేశం చేసిన లబ్ధిదారులు వాపోయారు. దాదాపు 1500 ఇండ్ల ను పంపిణీ చేయగా, అన్నింటి పై అంతస్తుల్లో ఇదే సమస్య ఎదురైంది. ఇక గ్రౌండ్​ ఫ్లోర్​లో ఉన్నవాళ్లు మరో సమస్య ఎదుర్కొన్నారు. ఇండ్ల ఆవరణలో పడ్డ నీళ్లు పోయేందుకు డ్రైనేజీ సిస్టమ్​ సరిగ్గా లేక చాలామంది ఆదివారం అర్ధరాత్రి దాక పారలు పట్టుకొని నీళ్లు మలుపుతూ కనిపించారు. పనులు క్వాలిటీగా చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

మరోసారి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటాం.. 

నర్సాపూర్ వద్ద సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ పూర్తి కాకపోవడం, పలుచోట్ల డ్రైన్లలో చెత్త పేరుకపోవడం వల్లే వరద సమస్య వచ్చింది. వీటిని అత్యవసరంగా పరిష్కరిస్తాం. మరోసారి పట్టణ ప్రజలు ఇలాంటి సమస్యను ఎదుర్కోకుండా చూస్తాం. యూజీడీ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.
- రమణాచారి, ఇన్​చార్జి మున్సిపల్ కమిషనర్​, సిద్దిపేట

గతంలో ఎప్పుడూ చూడలే.. 

గతంలో ఎంత భారీ వర్షం పడ్డా సిద్దిపేట పట్టణంలో ఇలాంటి వరద చూడలేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అస్తవ్యస్తంగా చేసినందునే ఈ సమస్య వచ్చింది. భారత్ నగర్​లోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ కాలువలను తలపించాయి. ఇండ్లలోకి నీళ్లు చేరాయి. అండర్ గ్రౌండ్ డ్రేనేజీ చాంబర్ల నుంచి నీళ్లు బయటికి ఎగజిమ్మాయి. ఆఫీసర్లు వెంటనే తగిన చర్యలు తీసుకొని మరోసారి ఇలాంటి ప్రాబ్లమ్​ రాకుండా చూడాలి. 
- డి.సాగర్, సిద్దిపేట