హైదరాబాద్ లో తేలికపాటి వాన.. అత్యధికంగా షేక్​పేటలో

హైదరాబాద్ లో  తేలికపాటి వాన.. అత్యధికంగా షేక్​పేటలో

హైదరాబాద్, వెలుగు: సిటీలో శనివారం పలు చోట్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మబ్బు పట్టి ఉండగా.. ఒక్కో ఏరియాలో ఒక్కో టైమ్​లో వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు మాత్రమే పడ్డాయి. అత్యధికంగా షేక్​పేటలో 1.5 సెంమీ, జూబ్లీహిల్స్​లో 1.3, కృష్ణానగర్​లో 1.3. బోరబండలో 1.2 సెం.మీల వర్షపాతం నమోదైంది. మాదాపూర్ 100 ఫీట్ రోడ్ నుంచి చెక్ పోస్ట్​ వైపు వచ్చే రూట్​లో రోడ్డుపై నీరు చేరడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది.

ఇలా కొన్ని ప్రాంతాల్లో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. సిటీలో మరో రెండ్రోజులపాటు తేలికపాటి వానలు పడే చాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వానల నేపథ్యంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జోనల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కుత్బుల్లాపూర్​లోని అయోధ్యనగర్, బల్కంపేట, మయూరి మార్గ్, మాదాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, ఎల్​బీనగర్ పరిధి నాగోల్​తో పాటు ఇతర లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవకుండా చూడాలని మేయర్ ఆదేశించారు.

మ్యాన్​హోల్స్ పొంగితే వెంటనే బల్దియా అధికారులకు సమాచారం ఇవ్వాలని.. వాటిని తెరవొద్దని సిటిజన్లకు సూచించారు. మ్యాన్​హోల్ మూత తెరిచి ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. అనధికారికంగా మ్యాన్ హోల్ మూతలను తెరిచిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. టెలీ కాన్ఫరెన్స్​​లో జోనల్ కమిషనర్లు మమత, వెంకటేశ్, శ్రీనివాస రెడ్డి, పంకజ పాల్గొన్నారు.