దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో మరో 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. రుతుపవనాలు విస్తరించడంతో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తోపాటు దక్షిణాదిలోని కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్ లో గంగానదిలో ఉధృతి పెరిగింది. అలాగే భారీ వర్షాలకు కర్నాటక రాజధాని బెంగళూరులో జనజీవనం స్తంభించింది. కేరళ రాష్ట్రంలోని నదుల్లో నీటి మట్టం పెరిగింది. 

గంగానదిలో వరద ఉధృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు  జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. దీంతో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి వరద బాధిత ప్రాంతాలను పరిశీలించారు. పునరావాస కేంద్రాలను సందర్శించి వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వరద బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని సీఎం యోగి హామీ ఇచ్చారు. 

భారీ వర్షాలతో పశ్చిమ బెంగాల్ సిలిగురిలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చిన్న వర్షానికే కాలనీల్లోకి నీరు వచ్చి చేరుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటకు వెళ్లేందుకు కూడా వీలు లేని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వరద ప్రభావం తగ్గేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. 

కేరళ నదుల్లో పెరిగిన నీటిమట్టం

కేరళ రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. కొట్టాయం జిల్లా తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి భారీగా నీరు చేరడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. తిండి, తాగునీరు లేక అవస్థలు పడ్డారు. తీరప్రాంతమైన అలప్పుజా జిల్లా కుట్టనాడులో ప్రవహించే నదుల్లో నీటిమట్టం పెరిగింది. 

అలాగే కర్నాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వాన నీరు వరదలా ప్రవహించింది. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లు కనిపించని పరిస్థితి ఉండడంతో వాహనాలు చాలా నెమ్మదిగా కదిలాయి. కుండపోత వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్డు అధ్వాన్నంగా మారింది. 

ఇవాళ కూడా దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, కేరళలో వచ్చే 5 రోజులు భారీగా వానలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. లక్షద్వీప్ లో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.