
- రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గాలిదుమారం, వడగండ్ల వాన
- కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు
- దెబ్బతిన్న పంటలు..కూరగాయలు.. మామిడి తోటలు
నెట్వర్క్, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షం రైతులను మరోసారి ఆగం చేసింది. కొనుగోలు సెంటర్ల దగ్గర వడ్లు తడిసిపోగా, కోతకు సిద్ధంగా ఉన్న వరిపంటతోపాటు కూరగాయలు, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడింది. సిద్దిపేట మార్కెట్ యార్డులోని ధాన్యం.. వరద నీటి ధాటికి శ్రీరాం కుంట్ల చెరువులోకి చేరింది. కొండపాక మండలం దుద్దెడ టోల్ గేట్ పైకప్పు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
చిన్నకోడూరు మండలం కిష్టాపూర్ లో పిడుగు పడి చక్రాల బాలరాజ్ కు చెందిన 2 ఆవులు మృతి చెందాయి. మెదక్జిల్లాలో సైతం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. కుమ్రం భీమ్ అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ లోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కౌటాల మండల కేంద్రంతోపాటు గుడ్ల బోరి, విజయనగరం, సైదాపూర్, మొగడ్ దగడ్ గ్రామాల్లో చెట్లు విరిగి కరెంటు స్థంభాలపై పడ్డాయి. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, సదాశివనగర్, మాచారెడ్డి, గాంధారి మండలాల్లో అకాల వర్షం కురిసింది.
పాతరాజంపేట, టెకిర్యాల్, జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్, మాచారెడ్డి మండలం చుక్కాపూర్, సదాశివనగర్ మండలం పద్మాజివాడీల్లో వడగండ్ల వానతో రైతులు ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది. తిమ్మాపూర్ మండలంలో పలు తోటల్లో మామిడి కాయలు నేలరాలాయి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలకేంద్రంలోని చైతన్య నగర్‌లో ఇంటి ముందు నిలిపి ఉంచిన టాటా మ్యాజిక్, స్కూటీపై గాలివానకు పక్కనే ఉన్న 11 కేవీ కరెంట్ తీగలు తెగి పడగా, అవి కాలిపోయాయి. దీంతోపాటు ఆ పక్కనే ఆరబోసిన మక్కజొన్న కంకులు మూడు క్వింటాళ్ల మేర దగ్ధమయ్యాయి.