తిరుగు ప్రయాణంలోనూ తప్పని తిప్పలు

తిరుగు ప్రయాణంలోనూ తప్పని తిప్పలు

సంక్రాంతి సంబరాలు అయిపోయాయి. మూడు రోజుల పాటు పండగ సెలబ్రేషన్స్ తో ఎంజాయ్ చేసిన జనం సిటీకి తిరుగు పయనమయ్యారు. రిటర్ జర్నీలో కూడా బస్సులు,  రైళ్లల్లో రద్దీ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవస్థలతోనే తిరుగు ప్రయాణం సాగిస్తున్నారు. మరోవైపు టో ల్ గేట్ల దగ్గర వాహనాల రద్దీ పెరిగింది.

సంక్రాంతి పండుగ సంబురం ముగిసింది. ఇక బతుకు పోరాటం మొదలైంది. దీంతో పండక్కు సొంతూళ్లకు వెళ్లిన జనం.. తిరిగి పట్నం బాట పడుతున్నారు. ఇవాళ్టి నుంచి ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు ఉన్నవాళ్లు సిటీకి బయలుదేరుతున్నారు. దీంతో గత మూడురోజులుగా ఖాళీగా దర్శనమిచ్చిన రోడ్లపై ప్రస్తుతం జనసంచారం పెరిగింది. ఇక వెళ్లేప్పుడు ఎదుర్కొన్న ట్రావెలింగ్ కష్టాలు.. వచ్చేప్పుడు కూడా తప్పటంలేదు.

పండుగకు లక్షలాదిగా ఆంధ్రాకు తరలివెళ్లారు జనం. కిక్కిరిసిన బస్సులు, రైళ్లలో అవస్థలు పడుతూ ప్రయాణం సాగించారు. ఇప్పుడు పండుగ ముగియటంతో.. సేమ్ సీన్ రిపీటవుతోంది. హైదరాబాద్ కు పెద్దఎత్తున ప్రజలు వస్తుండటంతో.. హైవేలపై రద్దీ పెరిగింది. బస్సులు, రైళ్లు కూడా ఫుల్ రష్ తో నడుస్తున్నాయి.

హైదరాబాద్ కు వచ్చే జనంతో హైవేలపై వాహనాల రద్దీ పెరిగింది. హైదరాబాద్-విజయవాడ హైవేతో పాటు ఇతర హైవేలపై ఉన్న టోల్ గేట్ల దగ్గర.. వాహనాల ఫ్లోటింగ్ మామూలు రోజుల కంటే కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది. టోల్ సిబ్బంది కూడా హైదరాబాద్ కు వచ్చే లైన్లను పెంచి.. వెళ్లే లైన్లను తగ్గించారు. అదనపు సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు వెహికిల్స్ ను పంపించే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణ జిల్లాలకు వెళ్లిన జనం కూడా హైదరాబాద్ కు తిరిగి వస్తున్నారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులన్నీ ఫుల్ రష్ తో నడుస్తున్నాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా.. రద్దీని బట్టి సిటీ బస్సులను కూడా ఇతర ప్రాంతాలకు నడుపుతోంది ఆర్టీసీ.

ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా.. హైవేలపై పెట్రోలింగ్ పార్టీలతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు పోలీసులు.