తొలిరోజు ఆలయాల కిటకిట

తొలిరోజు ఆలయాల కిటకిట

కొత్త సంవత్సరం తొలిరోజు ప్రజలు ఆలయాల బాట పట్టారు. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి , భద్రాద్రి రామయ్య, వేములవాడ రాజన్న, కొమురెల్లి మల్లన్న, కొండగట్టు అంజన్న, బాసర సరస్వతి, ఏడుపాయల వన దుర్గాభవాని ఆలయాలతో పాటు మెదక్​ చర్చి కిక్కిరిసిపోయాయి. ఆదివారం సెలవు కావడం కలిసివచ్చింది. యాదాద్రిలో ఉదయం 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు నాన్ స్టాప్ దర్శనాలకు అవకాశం కల్పించారు.  

మధ్యలో బ్రేక్ దర్శనాలు, స్వామివారికి నివేదన, ఆరగింపు కైంకర్యాలు చేపట్టారు. రద్దీ ఎక్కువగా ఉంటుందని ముందే ఊహించి లక్ష లడ్డూలను సిద్ధం చేసి ఉదయం 5 గంటల నుంచే అమ్మకాలు ప్రారంభించారు. ధర్మదర్శనానికి 6 గంటలు, స్పెషల్ దర్శనానికి 3 గంటలు పట్టింది. సరిపడా బస్సులు లేకపోవడంతో చాలామంది భక్తులు ఘాట్ రోడ్డు, మెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ కొండపైకి చేరుకోవాల్సి వచ్చింది. పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా రూ.75,94,285 ఆదాయం వచ్చింది. ఏడుపాయల అమ్మవారిని పూలతో అలంకరించారు. దర్శనానికి  గంటల కొద్దీ సమయం పట్టినా ఓపికతో నిల్చొని కొత్త ఏడాది అంతా మంచి జరగాలని ఇష్ట దైవాలను ప్రార్థించారు.  - వెలుగు, నెట్​వర్క్​