రాహుల్ గాంధీ యాత్ర ముగింపు సభకు అంతరాయం !

రాహుల్ గాంధీ యాత్ర ముగింపు సభకు అంతరాయం !

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుంది. మొత్తం 145 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో భాగంగా రాహుల్​ గాంధీ 3,970 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. శ్రీనగర్​లోని ఎస్​కే స్టేడియంలో భారత్ జోడో యాత్ర ముగింపు  సభ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే  ఈ సభకు శ్రీనగర్ లో కురుస్తున్న మంచు ఆకటం కలిగిస్తోంది. హిమపాతం కారణంగా శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారిని మూసివేయగా.. విమాన రాకపోకలకు కూడా అంతరాయం కలిగే అవకాశముంది. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే రాహుల్ గాంధీ సభకు విపక్ష నేతలు రావడం అసాధ్యంగా కనిపిస్తోంది. 

పొగ మంచు, నిరంతరంగా కురుస్తున్న హిమపాతం కారణంగా శ్రీనగర్‌కు వెళ్లే అన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని శ్రీనగర్ విమానాశ్రయ డైరెక్టర్ కుల్దీప్ సింగ్ రిషి ట్విట్టర్‌లో తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా విస్తారా ఎయిర్‌లైన్స్ ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు వెళ్లే రెండు విమానాలు రద్దు చేసింది. జమ్ములో నిర్వహిస్తున్న సభకు కాంగ్రెస్ 21 పార్టీలను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కొందరు హాజరుకావడం లేదని అధికార వర్గాలు తెలిపాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, టీడీపీలు ఈ కార్యక్రమానికి ఇప్పటికే దూరంగా ఉన్నాయి.