వెలుగు నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం రోజంతా వాన పడింది. పలుచోట్ల వాగులు పొంగి రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. మెదక్ జిల్లాలో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మెదక్ పట్టణంలోని గాంధీనగర్లో ఇండ్లలోకి నీళ్లు చేరాయి. పాపన్నపేట మండలం కొత్తపల్లి బ్రిడ్జి వద్ద రోడ్డు పూర్తిగా కోట్టుకుపోయి మెదక్, -పాపన్నపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద శంకరంపేట, -నార్సింగి మధ్య రోడ్లు దెబ్బతిన్నాయి. వర్షానికి సిద్దిపేటలోని నాసర్పుర కాలనీలో ఇల్లు కూలిపోయింది. వరంగల్ సిటీలో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జగిత్యాల జిల్లాలో మోతె వాగు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు కోరుట్లలోని ప్రకాశం రోడ్డు మునిగింది. మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోకి వరద నీరు చేరింది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరులో పిడుగు పడి కందుల ఆగయ్య అనే రైతుకు చెందిన 9 ఆవులు, ఒక దూడ చనిపోయాయి.
వన దుర్గాభవానీ ఆలయం బంద్
శ్రీరాంసాగర్ లోకి భారీగా వరద చేరుతోంది. లక్షా 85 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా 22 గేట్ల ద్వారా 99,890 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ఇప్పుడు 1091.0 అడుగుల వరకు నీరు ఉంది. కడెం ప్రాజెక్టులోకి వరద చేరుతుండడంతో ఒక గేటు ఎత్తారు. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం 10 గేట్లు ఎత్తి నీరు వదిలేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తి 14.030 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. –సింగూర్ బాగారెడ్డి ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి 35,491వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.సింగూరు నీటిని వదలడంతో ఏడుపాయల వన దుర్గాభవానీ ఆలయం ముందు నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆలయాన్ని మూసివేశారు.
రెండ్రోజులు భారీ వర్షాలు
రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వానలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం రాష్ట్రంలోని 19 జిల్లాలకు ఆ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. కాగా, శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మెదక్ జిల్లా టెక్మల్లో 15.2 సెం.మీ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో 12.1, కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 11.05 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
