హైదరాబాద్: సంక్రాంతి పండగ అయిపోయింది. పండక్కి సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి పట్నం బాట పట్టారు. చదువు, ఉద్యోగం, వ్యాపారం వివిధ పనుల దృష్ట్యా సిటీకి తిరుగు పయనమయ్యారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ (ఎన్హెచ్ 65) హైవేపై వాహనాల రద్దీ మొదలైంది. శనివారం (జనవరి 17) ఉదయం 11 గంటల తర్వాత వాహనాలు ఒకేసారి రోడ్డెక్కడంతో ఎన్హెచ్ 65 కిక్కిరిసిపోయింది.
చిట్యాల దగ్గర జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. ప్రైవేట్ కార్లు, బస్సులు, ఆటోలు, లారీల రద్దీతో కిలోమీటర్ల మేర వెహికల్స్ నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి వేడుకలు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హైదరాబాద్కు ప్రయాణించే అవకాశం ఉండటంతో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.
