పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటం: వివేక్ వెంకటస్వామి

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటం: వివేక్ వెంకటస్వామి
  • కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్యను పరిష్కరిస్తం: వివేక్ వెంకటస్వామి
  • మునిగిన పంటలకు పరిహారం ఇస్తమని భరోసా
  • బ్యాక్ వాటర్, ప్రాణహిత వరదలతో మునిగిన పంటలను పరిశీలించిన చెన్నూరు ఎమ్మెల్యే

కోల్ బెల్ట్, వెలుగు: కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో చెన్నూర్ నియోజకవర్గంలో ఏటా వేలాది ఎకరాల్లో పంటలు మునుగుతున్నాయని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మంగళవారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం కోటపల్లి మండలంలోని దేవులవాడ, అన్నారం, సిర్ష, జనగామ గ్రామాల్లో కాళేశ్వరం బ్యాక్ వాటర్, ప్రాణహిత వరదలతో నీట మునిగిన పంటలను వివేక్ పరిశీలించారు. బాధిత రైతులను కలిసి భరోసా ఇచ్చారు. 

ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అధికారులు స్టడీ చేస్తున్నారని చెప్పారు. ‘‘ఈ సమస్యపై మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి, అధికారులతో మూడుసార్లు చర్చించాను. వారం లోపు మరో సమావేశం ఉంది” అని తెలిపారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మునిగిన పంటలకు ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నీట మునిగిన పంటల వివరాలను వారం లోపు సేకరించి, పరిహారంపై నివేదిక ఇవ్వాలని అగ్రికల్చర్ అధికారులను ఆదేశించారు. ‘‘కాంగ్రెస్ సర్కార్ రైతులకు అండగా ఉంటుంది. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నది. ఇప్పటికే రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేసింది. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తుంది” అని పేర్కొన్నారు. 

ప్రాధాన్య క్రమంలో పనులు.. 

సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్టు వివేక్ చెప్పారు. ఆరు నెలలకు ఒకసారి ఫండ్స్ మంజూరు చేస్తానని, ప్రాధాన్య క్రమంలో ఒక్కొక్కటిగా అభివృద్ధి పనులన్నీ చేస్తానని తెలిపారు. చెన్నూర్, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినట్టు వెల్లడించారు. దేవులవాడలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.12 లక్షలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. 

అటవీ భూముల సమస్యను పరిష్కరిస్త.. 

చెన్నూర్ నియోజకవర్గంలో అటవీ భూములు ఎక్కువగా ఉన్నాయని, ఆ ప్రాంతాల పరిధిలోని ప్రజలు కనీస సౌలతులు లేక ఇబ్బందులు పడుతున్నారని వివేక్ అన్నారు. కేంద్ర అటవీ చట్టాల కారణంగా ఆయా ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిలు తదితర పనులు చేపట్టకుండా ఫారెస్ట్ ఆఫీసర్లు  అడ్డుకుంటున్నారని తెలిపారు. దీనిపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిని కలిసి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అలాగే పోడు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. పోడు రైతులను ఇబ్బందులు పెట్టొద్దని జిల్లా కలెక్టర్ ను ఇప్పటికే ఆదేశించినట్టు తెలిపారు.

 ‘‘చెన్నూర్ నియోజకవర్గంలో ఎక్కువగా అటవీ భూములు ఉన్నాయి. అటవీ చట్టాల కారణంగా అభివృద్ధి పనులు చేయలేకపోతున్నాం. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్లి అటవీ చట్టాల్లో మార్పులు చేయించాలి” అని అన్నారు. ప్రతిపక్ష నాయకులకు తనను విమర్శించడం ఫ్యాషన్ గా మారిందని మండిపడ్డారు. ఫారెస్ట్ అధికారులు చెబుతున్నట్టుగా చెన్నూర్ లో అటవీ భూముల ఆక్రమణ జరగలేదని, అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. 

ఎడ్ల బండి, ట్రాక్టర్​పై వెళ్లి పంటల పరిశీలన.. 


కోటపల్లి మండలం దేవులవాడ, అన్నారం, సిర్ష గ్రామాల్లో మునిగిన పంటలను వివేక్ పరిశీలించారు. అగ్రికల్చర్ అధికారులు, కాంగ్రెస్ లీడర్లతో కలిసి ఎడ్ల బండి, ట్రాక్టర్ పై వెళ్లి మునిగిన పంటలను  ఆయన పరిశీలించారు. అక్కడ బాధిత రైతులతో మాట్లాడి, ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.