వచ్చే నెల నుంచి ‘హీరో’ ధరల పెంపు

వచ్చే నెల నుంచి ‘హీరో’ ధరల పెంపు

న్యూఢిల్లీ: ఆటోమొబైల్ కంపెనీ హీరో మోటోకార్ప్  తన టూ-వీలర్ వెహికల్స్ ధరలను వచ్చే నెల నుండి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎక్స్ షోరూమ్ ధరలను రూ. 2,000 వరకు పెంచనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. పెరుగుతున్న కమోడిటీ ఖర్చుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. ఆన్​రోడ్ ధరలు ఆయా రాష్ట్రాల పన్నులను బట్టి మారుతాయి. హీరో మోటోకార్ప్ గత ఆరు నెలల్లో టూవీలర్ వెహికల్స్ ధరలను పెంచడం ఇది మూడోసారి. చివరిగా జూలై 1న కంపెనీ మోటార్‌‌‌‌‌‌సైకిళ్ల  స్కూటర్ల ఎక్స్ షోరూమ్ ధరలను రూ. 3,000 వరకు పెంచింది. ఆ తర్వాత సెప్టెంబరులోనూ రూ. 3,000 వరకు పెంచింది. స్టీలు, కాపర్ వంటి కమోడిటీ ధరల పెరుగుదలే ఇందుకు కారణమని అప్పుడు కూడా ప్రకటించింది. హీరోతో పాటు ఎం అండ్ ఎం, రెనాల్ట్, టాటా మోటార్స్, హోండా కార్స్,  టయోటా వంటి ఇతర కంపెనీలు కూడా జూలై–ఆగస్టు కాలంలో ధరలను పెంచాయి.