రజినీ.. ఈ రహదారిలో!

V6 Velugu Posted on Jan 23, 2020

రజినీకాంత్​ రాటు దేలాడా? ఈసారి పొలిటికల్​ అరంగేట్రం ఖాయమేనా? ద్రావిడులుగా గర్వపడే తమిళుల్లో జాతీయ భావనలు నింపుతాడా? కరుణానిధి భావజాలాన్ని, జయలలిత జనాకర్షణను బేలన్స్​ చేసుకుంటూ బ్యాలెట్​ వార్​ చేయగలడా? తమిళనాడు సమస్యలతో అంటీముట్టనట్లుండే సూపర్​స్టార్​ చేతికి స్టీరింగ్​ ఇచ్చేదెవరు? బ్యాక్​ సీటు డ్రైవింగ్​ ప్లాన్​ ఎవరిదో? ఊహాగానాల్లో జనాన్ని ముంచెత్తడం రజినీకి అలవాటేగానీ, ఈసారి అనేక సందేహాల్ని తెరపైకి తెచ్చాడంటున్నారు ఎనలిస్టులు.

రజినీకాంత్​ మునుపటిలా విమర్శకు జడవడం లేదు. ఎదురుతిరిగి బదులిస్తున్నారు. నటుడిగా తనకున్న పాపులారిటీకి… వయసుతో వచ్చిన మెచ్యూరిటీని జోడించి తిప్పికొడుతున్నారు. పైగా, మునుపటిలా బెంబేలెత్తడం లేదు. మొన్నటికి మొన్న ద్రవిడ ఉద్యమ నాయకుడు రామస్వామి నాయకర్​పై కామెంట్లు చేసి స్థిరంగా నిలబడ్డారు.  పెరియార్​ పార్టీవాళ్లు రజినీ కామెంట్లను ఖండించి సారీ చెప్పమంటే, చెప్పనుగాక చెప్పను పొమ్మన్నారు. ఇలాంటి మొండితనం ఇంతకుముందు రజినీకాంత్​లో లేదంటున్నారు ఎనలిస్టులు. రాజకీయాల్లోకి దూకుడుగా ఎంట్రీ ఇవ్వడానికి ‘తుగ్లక్’ పత్రిక గోల్డెన్​ జూబ్లీ వేడుకల్ని తెలివిగా ఉపయోగించుకున్నారని కొందరు అంటుంటే,  జనం దేనికి కనెక్ట్​ అవుతారో తెలియకుండా తొందరపాటుతో రజినీ నోరు జారారని మరికొందరు అంటున్నారు.

ఇంతకీ ఈ వివాదం వివరాల్లోకి వెళ్తే…. పెరియార్​ రామస్వామి నాయకర్​ 1971 ఫిబ్రవరిలో… సేలంలో ఒక ర్యాలీ నిర్వహించారు. దానిలో సీతారాముల బొమ్మలను చెప్పుల దండలతో ఊరేగించారు. ద్రవిడ కజగం (డీకే) నిర్వహించిన ఈ ర్యాలీ వివరాల్ని, ఫొటోలతోసహా చో రామస్వామి తన ‘తుగ్లక్​’ పత్రికలో వేయించారు.  ఇది జరిగిన సమయానికి తమిళనాడులో రాష్ట్రపతి పాలన ఉంది. కరుణానిధి ఫస్ట్​ టైమ్​ ముఖ్యమంత్రి అయ్యాక ఏడాదిలోనే కేంద్రం ఆయనపై ఆర్టికల్​ 356ని ప్రయోగించి 1971 జనవరి 5న  ప్రభుత్వాన్ని డిస్మిస్​ చేసింది. తుగ్లక్​ పత్రికలో పబ్లిషయిన వార్తను, ఫొటోల్ని కరుణానిధి తెలివిగా తమకనుకూలంగా మలచుకున్నారు. ద్రవిడ ఉద్యమంపైనా, పెరియార్​ ఐడియాలజీపైనా జరిగిన దాడిగా ప్రచారం చేశారు. 68 రోజుల ప్రెసిడెంట్​ రూల్​ తర్వాత మార్చి 14న మళ్లీ కరుణానిధి ముఖ్యమంత్రి కాగలిగారు. ఈ విషయాన్ని అక్కడితో వదిలేశారు.

నాస్తికవాదం ఇంకా ఉందా!

ఎప్పుడో 1971లో జరిగిన ఒక సంఘటనను రజినీ ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటన్నదే పెద్ద ప్రశ్న. ఆయన చాలా స్ట్రేటజీతోనే ‘తుగ్లక్’ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి… ఇరు వర్గాలను రెచ్చగొట్టినట్లున్నారు. అయితే, ఇదసలు ప్రస్తుతం సమస్యే కాదని కొందరు కొట్టిపారేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. పెరియార్​ ఇండిపెండెన్స్​ పోరాట కాలం నుంచీ బ్రాహ్మణుల అథారిటీని ఆర్య–ద్రవిడ కోణాల్లో ప్రశ్నించిన నాయకుడు. ఆయన ఉద్యమ ఎజెండాలో మద్యనిషేధం, హేతువాదం, స్త్రీ పురుష సమానత్వం, కుల వ్యతిరేకం, స్త్రీలు, దళితుల హక్కులు ప్రధానమైనవి.

పెరియార్​కి దేవుడంటే పిచ్చి కోపం

సంఘ సంస్కర్తగా పేరుపడ్డ పెరియార్‌కు దేవుడంటే తీవ్ర వ్యతిరేకత ఉంది. డీకే కార్యకర్తలతో దేవుడి విగ్రహాలను, ముఖ్యంగా వినాయకుడి విగ్రహాలను ధ్వంసం చేయించారు. పెరియార్ (94) 1973లో చనిపోయాక ద్రవిడ ఉద్యమం బాగా బలహీనపడింది. అప్పటికే అన్నాదురై మరణించడంతో కరుణానిధి డీఎంకేని పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకుని తానే ప్రెసిడెంట్​నని ప్రకటించుకున్నారు. నిజానికి  తమిళులకు భక్తి చాలా ఎక్కువ. శైవ, వైష్ణవ సంప్రదాయాలనేవి చోళులు, పల్లవుల కాలం నుంచీ ఉద్యమస్థాయిలో కొనసాగాయి. ఆ భక్తి ఉద్యమాల్లో బ్రాహ్మణులు బాగా బలపడ్డారు.  బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తట్టుకోలేక పెరియార్ లాంటి సంస్కర్త పుట్టుకొచ్చారు. ద్రవిడులపై ఆర్యుల దాడిగా భక్తి సంప్రదాయాన్ని, పూజాదికాల్ని వ్యతిరేకించారు. చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు దగ్గరలోని ఆయన విగ్రహం కింద ‘దేవుడే లేడు’ అని రాసి ఉంటుంది. పైగా దేవుడ్ని నమ్మేవాళ్లంతా ఫూల్స్, స్కౌండ్రల్స్​ అని కూడా చెక్కి ఉంటుంది. పెరియార్​ వాదం ఎంజీఆర్​ బతికున్నంత కాలం కొనసాగింది. జయలలిత హయాం మొదలయ్యాక నాస్తికవాదం వెనకబడిపోయి, ఆస్తికవాదం ముందుకొచ్చింది. కరుణానిధి కొంతవరకు తన పార్టీని పెరియార్​ పద్ధతిలో నడపగలిగారు. డీఎంకేలో ఇప్పుడు స్టాలిన్​దే ఫుల్​ హవా. ఆమధ్య శ్రీరంగం ఏదో పార్టీ పనిమీద వెళ్లినప్పుడు ఆలయం దగ్గర పూజారులతో శాలువా సన్మానం, ప్రసాదం అందుకున్నారు. ఇక, గుడిలోకి వెళ్లడమే తరువాయిగా పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకున్నారు.

స్పీడ్​గా గ్రౌండ్​ వర్క్​

2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని రజినీకాంత్ ఇప్పటికే నిర్ణయించుకున్నారని ఆయన ఫ్యాన్స్​ చెప్పుకుంటున్నారు. ఎన్నికలు దగ్గర చేసి పార్టీని ప్రకటించాలన్నది రజినీ ప్లాన్​ అని, ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ జరుగుతోందని అంటున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకేలతోపాటు రజినీ రంగంలో దిగితే ట్రయాంగిల్​ వార్​ ఖాయం.  పైగా బీజేపీతో చేతులు కలపాల్సిన పరిస్థితే గనుక వస్తే… ఇదో అవకాశంగా ఉంటుందని అంచనా. అందుకే నాస్తికులను రెచ్చగొట్టి ఆస్తికులను తనవైపు తిప్పుకునే వ్యూహంలో భాగంగానే 50 ఏళ్లనాటి ర్యాలీని ప్రస్తావించారని ఎనలిస్టులు అంటున్నారు.

హైప్​తో ఎంట్రీ?

తమిళనాడుకు మరో ఏడాదిన్నరలో అసెంబ్లీ ఎలక్షన్స్​ రానున్నాయి. ఆ రాష్ట్రంలో పొలిటికల్​ గ్యాప్​ లేకపోయినా, చరిష్మాగల లీడర్లు లేరు. పాపులారిటీ పరంగా చూస్తే… రజినీకాంత్‌ టాప్​లో ఉన్నారు. ఆయన పక్కా ఆస్తికుడైన సూపర్‌ స్టార్. తోటి నటుడు కమల్‌ హాసన్ పూర్తిగా నాస్తికుడు. రజినీ హిమాలయం నుంచి అరుణాచలం వరకు ఆలయ దర్శనాలు చేస్తారు. దేవుడి పేరు చెప్పకుండా, దణ్ణం పెట్టకుండా ఏ పనీ చేయరు. తమిళనాడులో తరాలు మారిపోవడంతో మునుపటిలా సిద్ధాంతాలు, ఐడియాలజీకి ఓట్లేసే జనాలు తక్కువయ్యారు. పాపులర్​ స్కీమ్​లు, పాపులర్​ ఫేస్​లకే ఓట్లు పడుతున్నాయి. ఇదే మోకా అని రజినీకాంత్​ సినీ స్టయిల్​లో రాజకీయ అరంగేట్రం చేసినట్లు కనిపిస్తోంది. ఏదోక కాంట్రవర్సీ క్రియేట్​ చేస్తేనే సినిమాకి హైప్​ వస్తుందనుకోవడం కోలీవుడ్, బాలీవుడ్​ల్లో అలవాటు. పెరియార్‌ పట్ల ఆయన కామెంట్‌ ఈ దిశగా సంకేతాలిస్తోందంటున్నారు ఎనలిస్టులు.

ప్రెసిడెంట్​ కుర్చీ పెరియార్​దే

మొదట్లో కాంగ్రెస్​ పార్టీలో ఉన్న పెరియార్​ తర్వాత రోజుల్లో జస్టిస్​ పార్టీని స్థాపించారు. దానిని పూర్తిగా ద్రవిడ సిద్ధాంతాలతో జత కలిపి 1944లో ద్రవిడ కజగంగా మార్చారు. పెరియార్​ శిష్యుల్లో ముఖ్యులు అన్నాదురై, నెడుంజెళియన్​, కరుణానిధి ముఖ్యులు. ఎందుకోగానీ,  పెరియార్​ తన చివరి దశలో మణియమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అప్పటికి పెరియార్​ వయసు 72, ఆమె వయసు 32  ఏళ్లు. పెరియార్​ తన వారసురాలిగా మణియమ్మాయిని ప్రకటించే ఆలోచనలో ఉన్నారని తెలిసి… ముఖ్య శిష్యులందరూ వేరుపడ్డారు. అన్నాదురై ప్రధాన కార్యదర్శిగా ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఏర్పడింది. ఇప్పటికీ అన్నాడీఎంకేకి ప్రెసిడెంట్​ లేదా చైర్​పర్సన్​ పోస్టు ఉండదు. ఆ పోస్టుని పెరియార్​ మీద గౌరవంతో అన్నాదురై విడిచిపెట్టేశారు. ఆ పద్ధతినే ఎంజీఆర్​కూడా కంటిన్యూ చేశారు.

స్టాలిన్​ స్టాండేమిటి?

రజినీ కామెంట్లపై డీఎంకే ప్రెసిడెంట్​ స్టాలిన్​ చాలా ఆచి తూచి స్పందించారు. మాట్లాడే ముందు ఆలోచించాల్సిందని రజినీకి సలహా ఇచ్చారు. నిజానికి ఆయన పార్టీ… పెరియార్​ స్థాపించిన డీకే నుంచి పుట్టినదే. డీఎంకే నేతలెవరూ దేవుడ్ని నమ్మరు. కరుణానిధి హయామంతా అలాగే నడిచింది. ఆయనకు ఒంట్లో బాగోనప్పుడు డీఎంకే ఎమ్మెల్యే ఒకరు నిప్పుల మీద నడిచారు. కరుణానిధికి ఈ విషయం తెలిసి ‘ఇలాంటి పిచ్చి పని మరోసారి చేశావంటే పార్టీ నుంచి గెంటేస్తా’ అని వార్నింగ్​ ఇచ్చారు. ఆయన పోయాక డీఎంకే కుటుంబాల్లోనూ మార్పు వచ్చింది. కరుణానిధి భార్య సహా మహిళలు అన్ని రకాల నోములు, పూజలు పాటిస్తున్నారు. స్టాలిన్​కూడా అవసరమైతే రజినీతో జట్టు కట్టాలనుకుంటున్నారు. ఓట్ల కోసమే డీఎంకే డబుల్ గేమ్ ఆడుతోందన్న ఆరోపణలున్నాయి.

పెరియార్పై గతంలోనూ

రజినీకాంత్​… పెరియార్​ని ప్రస్తావించడం ఇదే మొదటిసారి కాదు. 1995లో తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు జరిగినప్పుడు రజినీకాంత్​ హైదరాబాద్ వచ్చారు. ఎన్​.టి.రామారావు చాలా మంచివారేగానీ, ఒక దుష్టశక్తి ఆయనను ఆవహించింది. తమిళనాడులోనూ పెరియార్​ రామస్వామికి ఇలాగే జరిగింది. మణియమ్మాయిని పెళ్లిచేసుకోవడంతో పార్టీ నాయకులంతా పెరియార్​కి దూరమయ్యారు. అయితే, ఆయన ఎప్పటికైనా తిరిగొస్తారన్న నమ్మకంతో ఒక కుర్చీ వేసి ఉంచారు. దానిలో ఎవరూ కూర్చునేవారు కాదు. ఎన్డీఆర్​కోసమూ ఒక కుర్చీ వేసి ఉంచండి. ఏదోకనాడు పార్టీలోకి తిరిగి వస్తారు’ అని కామెంట్​ చేశారు.

see also: చిన్నతనంలో నాపై రేప్ జరిగింది

Tagged POLITICS, Special, cinema, Rajinikanth, kollywood

Latest Videos

Subscribe Now

More News