
కొత్త తరహా కాన్సెప్ట్స్, అచ్చ తెలుగు టైటిల్స్‌తో ఆకట్టుకునే శ్రీవిష్ణు.. ఈసారి ‘అర్జుణ ఫల్గుణ’ అంటూ వస్తున్నాడు. తేజ మార్ని డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 31న రిలీజవుతున్న సందర్భంగా ఇలా ముచ్చటించాడు.
‘ఈ ఏడాది నాకిది మూడో రిలీజ్. నేను ఎక్కువగా వర్క్ చేసింది కొత్త దర్శకులతోనే అయినా వాళ్లంతా అద్భుతమైన రైటింగ్ స్కిల్స్ ఉన్నవాళ్లు. కానీ తేజ మార్నిలో రైటర్ కంటే డైరెక్టర్ ఎక్కువ కనిపించాడు. ‘జోహార్’కి ముందే నాకీ కథ చెప్పాడు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఐదుగురు ఫ్రెండ్స్ స్టోరీ. చాలా ఫ్రెష్‌గా అనిపించింది. నేను ఎన్టీఆర్ అభిమానిగా నటించాను. నా డైలాగ్స్ పూర్తిగా గోదావరి శ్లాంగ్‌లో ఉంటాయి. ఫన్‌తో పాటు ఫ్రెండ్స్ మధ్య ఉండే ఎమోషన్ అద్భుతంగా ఉంటుంది. సినిమాకి అదే హైలైట్. ఐదు పాత్రలూ సమానంగా ఉంటాయి. డైరెక్టర్ ప్రతి ఒక్కరికీ నువ్వే హీరో అని చెప్పి ఉంటాడు (నవ్వుతూ) . అందుకే ఎవరికి వాళ్లు అద్భుతంగా నటించారు. యాభై ఐదు రోజుల్లో పూర్తి స్థాయి ఔట్ డోర్ మూవీ తీయడం చాలా కష్టం. చాలా ఫాస్ట్‌గా తీశాడు. తను పెద్ద డైరెక్టర్ అవుతాడు’ అని శ్రీవిష్ణు అన్నాడు.
‘నా అన్ని సినిమాల్లాగే ఇందులోనూ హీరోయిన్ క్యారెక్టర్ రెస్పెక్టబుల్‌గా ఉంటుంది. ఆమె పోషించిన గ్రామ వాలంటీర్ పాత్రకి సంబంధించి ట్రైలర్‌లో ఉన్న డైలాగ్‌పై అభ్యంతరాలు వస్తున్నాయి. తమకు రాని ఉద్యోగం ఆమెకు వచ్చిందని అక్కసుగా చెప్పే డైలాగ్ అది. అందులో తప్పుగా ఏమీ లేదు. రిలీజ్ తర్వాత కూడా ప్రేక్షకులకు తప్పుగా అనిపిస్తే వెంటనే తీసేస్తాం. రియలిస్టిక్ సినిమాలు చేయడం అంత ఈజీ కాదు. ఏ హీరోకైనా తన కెరీర్‌లో అలాంటివి ఒకటో రెండో వస్తాయి. లక్కీగా నాకు వరుసగా అలాంటివే వస్తున్నాయి. నా బలం కూడా అవే. నా నెక్స్ట్ మూవీ ‘భళా తందనాన’. షూట్ పూర్తయింది. అలాగే లక్కీ మీడియా బ్యానర్‌లో ప్రదీప్ వర్మ అనే కొత్త డైరెక్టర్‌తో పోలీసాఫీసర్ బయోపిక్ చేస్తున్నాను. నెల రోజుల షూట్ బ్యాలెన్స్ ఉంది. ఇవి రెండూ రియలిస్టిక్‌గా ఉండే ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్. మరో సినిమాపై వారం రోజుల్లో అనౌన్స్‌మెంట్ వస్తుంది. కుర్చీకి పరిమితమయ్యే ఓల్డేజ్ పేషెంట్ పాత్ర. లుక్‌తో పాటు కాన్సెప్ట్‌తోనూ సర్‌ప్రైజ్ చేయబోతున్నా’ విష్ణు పేర్కొన్నాడు.