
అడిలైడ్: ఇండియా-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ లాంటి ప్లేయర్ల మీద అందరి దృష్టి నిలిచింది. అయితే బ్యాట్స్‌మెన్ కంటే కూడా బౌలర్ల పెర్ఫామెన్స్ మీదే ఈ సిరీస్‌లో గెలుపోటములు ఆధారపడి ఉంటాయని ఆసీస్ లెజెండరీ క్రికెటర్ అలెన్ బోర్డర్ అన్నాడు. ఫుల్ ఫిట్‌నెస్‌తో ఉన్న జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌ను ఇండియాకు అనుకూలంగా మార్చేస్తాడని బోర్డర్ చెప్పాడు. ఇరు జట్లలో ఉన్న పెద్ద తేడా ఏమైనా ఉందంటే అది బుమ్రా అని తెలిపాడు.
‘నేను బుమ్రాకు పెద్ద అభిమానిని. అతడు ఫిట్‌గా ఉంటే మాత్రం గేమ్స్‌ను గెలిపిస్తాడు. బుమ్రా బౌలింగ్ గురించి కొంత ఆందోళనగా ఉన్నా. ఎందుకంటే ఆసీస్ పిచ్‌ల్లో బౌన్స్ కొంత ఎక్కువగా ఉంటుంది. అలాగే బంతి అటూఇటూ కదులుతూంటుంది. భారత్ గెలవాలంటే బుమ్రా రాణించడం తప్పనిసరి. గత పర్యటనలోలా అతడు చెలరేగి కీలక వికెట్లు తీయగలిగితే రెండు జట్లలోనూ అతడే ప్రధాన మార్పు కాగలడు. టెస్టుల్లో గెలవాలంటే బ్యాట్స్‌మెన్ రాణింపు సరిపోదు. 20 వికెట్లు తీసే బౌలర్లు కావాలి. విరాట్ కోహ్లీని టీమిండియా మిస్సవుతుంది. అతడికి మూడు మ్యాచుల్లో బౌలింగ్ చేయాల్సిన అవసరం లేకపోవడం ఆసీస్ బౌలర్‌కు పెద్ద ఊరట కలిగించే అంశం’ అని బోర్డర్ పేర్కొన్నాడు.