
న్యూఢిల్లీ: గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్ తర్వాత నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్న స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని తిరిగి గ్రౌండ్‌లోకి ఎప్పుడు అడుగు పెడతాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్‌లో మాహీ బ్యాటింగ్ మెరుపులు చూద్దామనుకుంటే ఆ టోర్నీ కూడా రద్దయింది. ఈ ఏడాదిలో ఎలాగైనా ఐపీఎల్‌ను నిర్వహిస్తామని బుధవారం బీసీసీఐ బాస్ దాదా తెలిపాడు. అయితే ధోని రీఎంట్రీ గురించి తాజాగా అతడి మేనేజర్ మిహిర్ దివాకర్ కొంత స్పష్టతను ఇచ్చాడు. ప్రస్తుతం ధోని రిటైర్మెంట్ తీసుకునే ఆలోచన చేయట్లేదన్నాడు. మార్చిలో చెన్నై సూపర్ కింగ్స్ ట్రెయినింగ్ క్యాంప్ సందర్భంగా ధోనిలో తీవ్రతను చూస్తే అతడిలో చాలా క్రికెట్ మిగిలి ఉందని అనిపించిందన్నాడు. మంగళవారంతో మాహీకి 39 ఏళ్లు నిండిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ జరగడంపైనే ధోని రీఎంట్రీ ఆధారపడి ఉందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
‘మేం ఫ్రెండ్స్ కాబట్టి అతడి క్రికెట్ కెరీర్ గురించి నేను మాట్లాడను. కానీ అతణ్ని చూస్తుంటే రిటైర్‌మెంట్ గురించి ఆలోచిస్తున్నట్లు మాత్రం కనిపించడం లేదు. ఐపీఎల్‌లో ఆడాలని అతడు తీవ్రంగా శ్రమించాడు. చెన్నైలో అన్ని షట్‌డౌన్ కావడానికి ఒక నెల ముందు వరకు ధోని అక్కడే ఉండి ప్రాక్టీస్ చేశాడు. ఫామ్‌హౌజ్‌లో వర్కౌట్స్ చేస్తూ అతడు ఫిట్‌నెస్‌ను కాపాడుకున్నాడు. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేశాక మాహీ మళ్లీ ప్రాక్టీస్‌ను ప్రారంభిస్తాడు. పరిస్థితులు ఎంత త్వరగా మామూలు స్థితికి చేరుకుంటాయనే దానిపై ప్రతిదీ ఆధారపడి ఉంది’ అని దివాకర్ చెప్పాడు.