కొట్టి.. బలవంతంగా నేరాన్ని ఒప్పిస్తున్నారా?

కొట్టి.. బలవంతంగా నేరాన్ని ఒప్పిస్తున్నారా?

పోలీసులను
ప్రశ్నించిన హైకోర్టు
థర్డ్ డిగ్రీ విధానం
సరికాదని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు:కేసులను దర్యాప్తు చేసేందుకు థర్డ్ డిగ్రీ విధానం సరి కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. సయ్యద్‌‌‌‌‌‌‌‌ మహ్మద్, సయ్యద్‌‌‌‌‌‌‌‌ సోహెల్‌‌‌‌‌‌‌‌లను అక్రమంగా పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేశారని, ఆచూకీ తెలియడం లేదని వారి భార్యలు వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై హైకోర్టు సోమవారం మరోసారి విచారించింది. గత నెల 17న అరెస్టు చేస్తే చట్ట ప్రకారం పోలీసులు తమ డ్యూటీ ఎందుకు చేయలేదని చీఫ్ జస్టిస్ ఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ చౌహాన్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ అభిషేక్‌‌‌‌‌‌‌‌రెడ్డిలతో కూడిన డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ ప్రశ్నించింది.  కోర్టు ఆదేశాల మేరకు నిందితుల్ని పోలీసులు డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ ఎదుట గత విచారణ సమయంలో హాజరుపర్చారు. వారి గాయాలను గమనించిన బెంచ్ ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ డాక్టర్ల ను రప్పించి రిపోర్ట్ తెప్పించుకుంది. ఇద్దరిపై ఉన్న కేసుల్ని స్వయంగా విచారించి రిపోర్ట్ ఇవ్వాలని సైబరాబాద్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ ను ఆదేశించింది. ఆ రిపోర్ట్ సోమవారం హైకోర్టుకు అందింది.

సయ్యద్ మహ్మద్, సయ్యద్ సోహెల్ లు ఏం నేరం చేశారో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రిపోర్ట్ లో వివరించకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన చోరీ కేసులో దొరికిన వేలిముద్రలు, ఇద్దరి వేలిముద్రలకు పోలిక ఉందని పోలీసులు చెప్పడం బాగానే ఉందని, అయితే ఇప్పుడు జరిగినదానికి పోలిక ఉందా అని నిలదీసింది. నిందితుల్ని పోలీసులు వేధించలేదని అదనపు ఏజీ రామచందర్‌‌‌‌‌‌‌‌రావు హైకోర్టుకు చెప్పారు. నిందితుల వీపుపై గాయాలు ఎలా వచ్చాయని, కొట్టి నేరాన్ని బలవంతంగా అంగీకరించేలా చేస్తున్నారా అని ప్రశ్నించింది. చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్లకు చార్జిమెమో ఇచ్చామని కమిషనర్‌‌‌‌‌‌‌‌ రిపోర్టులో ఉండటాన్ని బెంచ్‌‌‌‌‌‌‌‌ కు అదనపు ఏజీ గుర్తు చేశారు. నిందితుల్ని కోర్టులో హాజరుపర్చినందున హెబియస్‌‌‌‌‌‌‌‌ కార్పస్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌పై విచారణ ముగిసిందని బెంచ్‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది.