తిరుమలలో అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో మృతి చెందిన బాలిక ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. ఈ క్రమంలో తిరుమల నడక మార్గంలో హై అలర్ట్ జోన్‌ను ప్రకటించింది. భక్తులకు భద్రతా సిబ్బంది పర్యవేక్షణను టీటీడీ తప్పనిసరి చేసింది. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్ జోన్ గా ప్రకటించింది. భక్తులకు మందువైపు, వెనుకవైపు రోప్‌లను టీటీడీ అధికారులు ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు పైలట్‌గా సెక్యూరిటీ సిబ్బందిని నియమించనున్నారు. అక్కడ 100 మంది భక్తుల గుంపుని మాత్రమే అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. నడకమార్గంలో ప్రతీ 40 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి టీటీడీ అండగా ఉంటుందని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. టీటీడీ నుంచి రూ.5లక్షలు, అటవీ శాఖ నుంచి రూ.5లక్షలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అలిపిరిలో చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనాలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అనుమతిస్తామని తెలిపారు . నడక మార్గంలో గుంపులు గుంపులుగా భక్తులను పంపుతున్నాను. చిరుత కదలికలను గుర్తించేందుకు అటవీ అధికారులు సీసీ కెమారాలు ఏర్పాటు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. నడక మార్గం వైపు చిరుతలు రాకుండా ఫారెస్ట్ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.