ఇబ్రహీం పట్నం ఎన్నిక కొనసాగించొచ్చు : హైకోర్టు

ఇబ్రహీం పట్నం ఎన్నిక కొనసాగించొచ్చు : హైకోర్టు
  •      మున్సిపాలిటీ చైర్మన్, వైస్‌‌ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్, వైస్‌‌ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియను కొనసాగించరాదంటూ ఈ నెల 17న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఎన్నికల ఫలితాలను వెల్లడించొద్దన్న ఆదేశాలను రద్దు చేస్తూ.. ఎన్నిక ప్రక్రియను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. మాజీ ఎమ్మెల్యే, ఆయన కొడుకులపై తీవ్ర అభియోగాలు, ఎన్నికను చట్ట ప్రకారం నిర్వహించడం లేదంటూ తమ ముందున్న అంశాలు.. కౌన్సిలర్‌‌ యాదగిరి ఆచూకీ తెలియడం లేదనే హెబియస్‌‌ కార్పస్‌‌ పిటిషన్‌‌కు సంబంధం లేదని తేల్చింది. 

యాదగిరిని కోర్టులో హాజరుపర్చినందున ఆ రెండు అంశాల జోలికి వెళ్లడం లేదని, అభ్యంతరాలు తీవ్రమైనవి అయినప్పటికీ వాటిపై సంబంధిత వేదికల వద్ద తేల్చుకోవచ్చునని వెల్లడించింది. యాదగిరిని కోర్టులో హాజరుపరిచి అతడి వాంగ్మూలం నమోదు చేసినందున పిటిషన్‌‌పై తదుపరి విచారణ అవసరం లేదని తేల్చింది. 

యాదగిరి స్వేచ్ఛగా ఉండేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలంది. యాదగిరిపై పోలీసులు, మాజీ ఎమ్మెల్యే కిషన్‌‌ రెడ్డి, అతడి కుమారుడు ప్రశాంత్‌‌ కుమార్‌‌ రెడ్డి ఒత్తిడి తీసుకురావొద్దని, బెదిరించరాదని ఆదేశించింది. యాదగిరి రక్షణ కోరితే ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. తన తండ్రి యాదగిరిని కిడ్నాప్‌‌ చేశారంటూ కుమారుడు ఆకుల హరికాంత్‌‌ హైకోర్టులో హెబియస్‌‌ కార్పస్‌‌ పిటిషన్‌‌పై విచారణ అవసరం లేదని తేల్చింది. 

బలవంతంగా తీసుకుపోయారు: యాదగిరి

ఈ నెల13న మాజీ ఎమ్మెల్యే కిషన్‌‌రెడ్డి ఆయన కొడుకు ప్రశాంత్‌‌ అనుచరులు తనను బలవంతంగా తీసుకెళ్లారని యాదగిరి హైకోర్టుకు చెప్పారు. ఏపీలోని బాపట్ల జిల్లా చీరాల సముద్రం వద్ద రిసార్ట్‌‌లో ఉంచారన్నారు. 14న రాత్రి ఒంటి గంట ప్రాంతంలో తన కుమారుడు వచ్చినా కలవనివ్వలేదన్నారు. తనను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టారని చెప్పారు. 

ఆ తర్వాత కారులో ఎక్కించుకుని రోజంతా కారులోనే తిప్పి 17న ఇబ్రహీంపట్నం తీసుకువచ్చారన్నారు. 19న తుక్కుగూడ ఫాం హౌస్‌‌లో ఉంచి నేరుగా ఎన్నికల వద్దకు తీసుకొచ్చారని తెలిపారు. తాను కూడా మున్సిపల్‌‌ చైర్మన్‌‌ పదవికి పోటీలో ఉన్నానని, 3 దఫాలు కౌన్సిలర్‌‌గా, ఒకసారి ఎంపీటీసీగా గెలిచినట్లు చెప్పారు. తాను లేకపోవడంతో మరొకరిని చైర్మన్‌‌గా పేరు ప్రకటించారని, 17కు ఎన్నిక వాయిదా పడిందన్నారు. 19న కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం మాత్రమే జరిగిందన్నారు.