151 పోస్టుల భర్తీకి 9 నెలల టైం కావాల్నా?

151 పోస్టుల భర్తీకి 9 నెలల టైం కావాల్నా?
  • నోటిఫికేషన్​పై ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు 

హైదరాబాద్, వెలుగు: అసిస్టెంట్‌‌ పబ్లిక్‌‌ ప్రాసిక్యూటర్స్‌‌ పోస్టులను భర్తీ చేయమని ఆదేశిస్తే.. అందుకు 264 రోజులు సమయం పడుతుందనడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 151 పోస్టుల భర్తీకి 9 నెలల టైం ఎందుకని రాష్ట్ర సర్కార్‌‌ను ప్రశ్నించింది. సమయాన్ని కుదించి 2 వారాల్లో మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. క్రిమినల్‌‌ కోర్టుల్లో అసిస్టెంట్‌‌ పబ్లిక్‌‌ ప్రాసిక్యూటర్స్(ఏపీపీ), పబ్లిక్‌‌ ప్రాసిక్యూటర్స్‌‌(పీపీ) పోస్టులు భర్తీ చేయాలని హైకోర్టు.. ప్రభుత్వాన్ని ఇదివరకే ఆదేశించింది. దీనిపై చీఫ్‌‌ జస్టిస్‌‌ హిమా కోహ్లీ, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం మరోసారి విచారించింది. ఏపీపీ పోస్టుల భర్తీకి.. రిక్రూట్‌‌మెంట్‌‌ బోర్డు ఈ నెల 4న నోటిఫికేషన్ ఇచ్చిందని ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ కోర్టుకు తెలిపారు. దాన్ని పరిశీలించిన బెంచ్.. నియామక ప్రక్రియకు 264 రోజులు పడుతుందని చెప్పడంపై విస్మయం వ్యక్తం చేసింది. వేగంగా నియామకాలు జరిగేలా మళ్లీ నోటిఫికేషన్‌‌ ఇవ్వాలని, ఆగస్టు 25న జరిగే విచారణ టైంలో సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.