హైదరాబాద్, వెలుగు: అటవీ శాఖ భూములను ఆక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అధికారం అధికారులకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వ్ ఫారెస్ట్ పరిరక్షణలో భాగంగా అటవీ అధికారులు చట్టబద్ధంగా విధులు నిర్వహించవచ్చని పేర్కొంది. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్‌లోని వక్ఫ్ ఆస్తి స్వాధీనం, నిర్వహణలో అటవీ శాఖ జోక్యం చేసుకుందంటూ మహమ్మద్ ఫలియాజ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అటవీ శాఖ తరఫు అధికారులు కౌంటర్ దాఖలు చేస్తూ ఈ విషయాన్ని హైకోర్టుకు తెలిపారు.
అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్‌ను 1967 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్‌లోని సెక్షన్ 4 ప్రకారం 1970 జులై 7న నోటిఫై చేసినట్లు అటవీశాఖ తన కౌంటర్‌లో పేర్కొంది. మొత్తం 3,718 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించగా, 368.09 ఎకరాల ఎన్‌క్లోజర్‌ను రిజర్వేషన్ నుంచి మినహాయించినట్లు తెలిపింది. మినహాయించిన ప్రాంతంలో మెడికల్ కాలేజీ, శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం, సున్నీ మసీదు, ఉస్మానియా మదర్సా, యూసుఫైన్ ఓల్డ్ ఏజ్ హోమ్ తదితర నిర్మాణాలు ఉన్నాయని వివరించింది. చట్టబద్ధంగా ఉన్న ఆస్తుల స్వాధీనం లేదా మతపరమైన కార్యకలాపాల్లో తాము జోక్యం చేసుకోలేమని, రిజర్వ్ ఫారెస్ట్ రక్షణలో భాగంగానే తనిఖీలు, ఇతర చర్యలు చేపట్టామని కోర్టుకు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
