తెలంగాణవారికే హైకోర్టు జడ్జి పదవులు ఇవ్వాలి..హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ తీర్మానం

తెలంగాణవారికే హైకోర్టు జడ్జి పదవులు ఇవ్వాలి..హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ తీర్మానం

హైదరాబాద్, వెలుగు: హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులను తెలంగాణవారితోనే భర్తీ చేయాలని హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ తీర్మానించింది. ఈ పోస్టులకు తెలంగాణ మూలాలున్న వారినే సిఫార్సు చేయాలని డిమాండ్‌ చేసింది. అంతేగాకుండా సామాజిక న్యాయసూత్రాలకు అనుగుణంగా అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. న్యాయమూర్తుల నియామకాల నిమిత్తం కొలీజియం ప్రతిపాదనలకు సంబంధించిన అంశంపై హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం అసాధారణ జనరల్‌ బాడీ సమావేశం జరిగింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు కొలీజియంలోని న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు వినతి పత్రాలు ఇవ్వాలని తీర్మానించింది. ఈనెల 17న మధ్యాహ్నం 1.45 గంటలకు హైకోర్టులో నిరసన కార్యక్రమం చేపట్టాలని తీర్మానించినట్లు బార్​ అసోసియేషన్​ కార్యదర్శి కె.నిరంజన్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు.