- హైదరాబాద్‌లోని పాక్ సంతతి వ్యక్తికి హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని పాక్ సంతతి వ్యక్తికి హైకోర్టులో చుక్కెదురైంది. లాంగ్ టర్మ్ వీసా (ఎల్‌టీవీ)కు అప్లై చేయాలని పోలీసులు తనను వేధిస్తున్నారని..వారిపై చర్యలు తీసుకోవాలంటూ సయ్యద్ అలీ హుస్సేనీ రజ్వీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. అధికారుల చర్యలు చట్టపరమైనవేనని తేల్చిచెప్పింది. ఆధార్, ఓటర్ కార్డు ఉంటే భారత పౌరులైపోరని స్పష్టం చేసింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత 2025 ఏప్రిల్‌లో కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు పాకిస్తాన్ పౌరులందరూ ఎల్‌టీవీ కోసం దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు తనను వేధిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని రజ్వీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీన్ని జస్టిస్ జస్టిస్ నగశ్ భీమపాక విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..రజ్వీ హైదరాబాద్‌లోనే పుట్టాడని..31 ఏండ్లుగా యాకుత్‌పురాలో నివసిస్తున్నాడని కోర్టుకు తెలిపారు.
అతను భారతీయురాలిని పెండ్లి చేసుకున్నాడని..వారికి ఇద్దరు పిల్లలని వివరించారు. రజ్వీకి ఆధార్, పాన్, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదిస్తూ..రజ్వీ తల్లి గోహర్ ఫాతిమా పాకిస్తాన్ పౌరసత్వం కలిగి ఉందని తెలిపారు. ఆమె పాస్‌పోర్టుతో భారత్‌కు వచ్చి నివాస అనుమతులు పొందారని కోర్టుకు చెప్పారు. రజ్వీ 1991లో పాకిస్తాన్‌లో పుట్టినట్లు అధికారిక రికార్డులు ఉన్నాయన్నారు.
పోలీసుల చర్యలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చట్టబద్ధంగా జరుగుతున్నాయని వివరించారు. హైకోర్టు స్పందిస్తూ.. పిటిషనర్ భారత పౌరుడని నిరూపించే ఆధారాలు లేవని తేల్చింది. ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు ఉన్నంత మాత్రాన భారత పౌరసత్వం ఉన్నట్లు కాదని స్పష్టం చేసింది. పౌరసత్వ చట్టం, విదేశీయుల చట్టం ప్రకారం.. పాస్‌పోర్టు, వీసా స్థితి, సంబంధిత అధికారుల ఉత్తర్వులే కీలకమని స్పష్టం చేసింది. అధికారుల విధులను అడ్డుకునేలా ఆదేశాలు ఇవ్వబోమని తేల్చిచెప్పింది.
