అసైన్డ్ భూముల రైతులకు పరిహారం చెల్లించాల్సిందే : హైకోర్టు

అసైన్డ్ భూముల రైతులకు పరిహారం చెల్లించాల్సిందే : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు : ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల్లో పట్టాదారులతో సమానంగా అసైన్డ్ భూముల రైతులకు పరిహారం చెల్లించాల్సిందేనని హైకోర్టు రాష్ట్ర సర్కారును ఆదేశించింది. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదని, అయినా అది పౌరుడికి ప్రాధాన్యమైన హక్కని చెప్పింది. భూమిని సేకరించాక పరిహారం ఇవ్వకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధిత రైతులు, అసైనీలు కోర్టుల ద్వారా ఉత్తర్వులు పొందే హక్కు ఉంటుందని  సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను గుర్తుచేసింది. విద్యాదేవి వర్సెస్‌‌ హిమాచల్‌‌ ప్రదేశ్‌‌ మధ్య కేసులో సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసిందని తెలిపింది. ఈ మేరకు చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ ఎన్‌‌.తుకారాంజీల బెంచ్‌‌ ఇటీవల తీర్పు చెప్పింది.

నల్గొండ జిల్లా పానగల్‌‌ గ్రామంలో ఉదయ సముద్రం ట్యాంకు నిర్మాణం కోసం ప్రభుత్వం 1998లో భూసేకరణకు నోటిఫికేషన్‌‌ ఇచ్చింది. పట్టాదారులకు, అసైనీలకు ఎకరాకు రూ.31,500 చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. దీంతో పట్టాదారులు జిల్లా కోర్టు, హైకోర్టులో కేసులు వేశారు. ఎకరాకు రూ.1.10 లక్షలు ఇవ్వాలని 2008లో హైకోర్టు తీర్పు చెప్పింది. తమకు కూడా అదే తరహాలో ఇప్పించాలని అసైనీలు 2016లో హైకోర్టును ఆశ్రయించారు. పట్టాదారులతో సమానంగా అసైన్డ్‌‌ భూముల కు పరిహారం చెల్లించాలని సింగిల్‌‌ జడ్జి తీర్పు చెప్పారు. దీనిని సవాల్‌‌ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టర్‌‌ అప్పీల్‌‌ పిటిషన్‌‌ వేయగా బెంచ్‌‌ కొట్టేసింది. మేకలపాండు, నారాయణస్వామి కేసుల్లో కూడా అదే తరహా ఉత్తర్వులు హైకోర్టు ఇచ్చిందని బెంచ్‌‌ గుర్తు చేసింది.