కోతుల కట్టడికి చర్యలు తీసుకోండి: హైకోర్టు

కోతుల కట్టడికి చర్యలు తీసుకోండి: హైకోర్టు
  • కోతుల నుంచి పంటలను రక్షించండి
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం


హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో కోతుల వల్ల పంటలకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వాటిని అటవీ ప్రాంతానికి తరలించేలా ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కోతుల నియంత్రణకు అధికారులు తీసుకున్న చర్యలపై స్టేటస్‌‌ రిపోర్టు ఇవ్వాలని చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ టి వినోద్‌‌ కుమార్‌‌లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం ఆదేశించింది. 

తమ ఆదేశాల్ని అమలు చేయనిపక్షంలో సంబంధిత అధికారులు కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కోవాల్సివస్తుందని హెచ్చరించింది. అలాగే, ఈ కేసులో కోర్టుకు సహాయకారిగా ఉన్న అమికస్‌‌క్యూరీ, లాయర్‌‌ ఎ.దివ్య సమర్పించిన నివేదికపై తీసుకున్న చర్యలను కూడా చెప్పాలని సూచించింది. నివాస ప్రాంతాలకు దూరంగా కోతులను అటవీ ప్రాంతంలోకి మళ్లించడానికి సంబంధించి ఆమె తయారు చేసిన నివేదికను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. 

దీనిపై ప్రభుత్వ ప్లీడర్‌‌ కల్పించుకుని, కోతుల నివారణకు పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు జరిగిందని, ఇందులో కోతులకు ఆహారంగా ఉండే పండ్ల చెట్లు ఉన్నాయని, కోతుల్ని ఆ వనాల్లోకి మళ్లిస్తున్నట్లు చెప్పారు. ‘ వాటిని ఏర్పాటు చేయడం బాగానే ఉంది. కానీ, అవి గ్రామాల్లోని వనాల్లోనే ఉండిపోవు. పంటలపై పడి పాడు చేస్తాయి కదా’ అని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.