- తదుపరి విచారణ నేటికి వాయిదా
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం దేవర యాంజాల్ గ్రామంలో శ్రీసీతారామస్వామి ఆలయానికి చెందిన ఒరిజినల్ రికార్డులతో హాజరుకావాలని దేవాదాయ శాఖ కమిషనర్ కు హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. 1,521.13 ఎకరాలకు సంబంధించి 1925–26 నుంచి ఈనెల 26 దాకా ఉన్న ఆలయ ఒరిజినల్ రికార్డులతో గురువారం కోర్టుకు రావాలని సూచించింది. దేవర యాంజాల్ భూములపై హక్కులకు సంబంధించి దాఖలైన 54 పిటిషన్‌లపై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ బుధవారం విచారణ చేపట్టారు.
ప్రభుత్వ న్యాయవాదులు కాట్రం మురళీధర్‌రెడ్డి, భూక్యా మంగీలాల్ నాయక్ వాదనలు వినిపిస్తూ 1925-–26 పహాణిలో శ్రీసీతారామస్వామి ఆలయం పేరుతో ఉందని, దీనికి ముతవల్లీ (ట్రస్టీ) గా రాముడి పుల్లయ్య పేరుతో ఉందని చెప్పారు. రాముడి పుల్లయ్య ట్రస్టీగా ఉన్న రికార్డుల్లో తరువాత యాజమానులు మారుతూ వచ్చారన్నారు. పిటిషనర్ల వద్ద కూడా హక్కులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
వాదనలను విన్న న్యాయమూర్తి దేవరయాంజాల్ భూములకు సంబంధించి 2015లో సింగిల్ జడ్జి ఉత్తర్వులున్నాయని, అందులో ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో ఉన్న పిటిషన్‌ల ప్రస్తావన ఉన్నా హైకోర్టు దృష్టికి తీసుకురాకపోవడంతో ఇరుపక్షాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటన్నింటిపై స్పష్టత ఇవ్వడానికి ఒరిజినల్ రికార్డులతో హాజరు కావాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఒకవేళ రికార్డులను హైకోర్టుకు సమర్పించకపోతే తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేశారు.
