హైదరాబాద్, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ లోని సర్వే నంబర్ 859, 960లోని నాలుగెకరాల భూమిని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ అవసరాలకే వినియోగించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఆ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించడానికి వీల్లేదని తెలిపింది. మినీ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి ఇద్దరు వ్యక్తులు ఆరెకరాలను విరాళంగా ఇవ్వగా, అందులోని రెండెకరాల్లో కస్తూర్బా పాఠశాల భవనాన్ని నిర్మించారు.
స్టేడియం నిర్మాణం చేపట్టకపోవడంతో మిగిలిన 4 ఎకరాలను తమకు అప్పగించాలని ఆ ఇద్దరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. వారి వాదనను సింగిల్ జడ్జి ఆమోదిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీల్ చేసింది. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్లతో కూడిన బెంచ్ ఇటీవల విచారించింది. ఈ స్థలాన్ని పాఠశాల, విద్యార్థుల ప్రయోజనాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
