గద్వాల తల్లీబిడ్డల మృతిపై..పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వండి

గద్వాల తల్లీబిడ్డల మృతిపై..పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వండి
  •     డాక్టర్లు, సిబ్బందిపై ఏంచర్యలు తీసుకున్నరు?
  •     రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ప్రసవం కోసం ఆరు ఆస్పత్రులకు తిరుగుతూ వైద్యం అందక తల్లీబిడ్డ మరణించిన ఘటనపై పూర్తి వివరాలతో రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బాధితురాలి కుటుంబానికి పరిహారం చెల్లించే విషయంపై ప్రభుత్వ విధానాన్ని తెలియజేయాలని, నిర్లక్ష్యం ప్రదర్శించిన డాక్టర్లు, వైద్య సిబ్బందిపై తీసుకున్న చర్యలనూ రిపోర్టు చేయాలని ఆదేశించింది. గద్వాల జిల్లా ఐజ మండలంలోని యాపదిన్నె గ్రామానికి చెందిన 20 ఏళ్ల జనీలా పురిటి నొప్పులతో 6 ఆస్పత్రులు తిరిగి చివరికి హైదరాబాద్‌‌లో ప్రసవించింది. తర్వాత కాసేపటికే తల్లీబిడ్డలు చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వార్తాకథనాల ఆధారంగా లాయర్లు​ కె.కిశోర్​ కుమార్, శ్రీనిత పూజారి హైకోర్టుకు లెటర్​ రాశారు. దీనినే పిల్​ గా పరిగణించి హైకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ కేసు శుక్రవారం మరోసారి విచారణకు వచ్చింది. లాక్‌‌డౌన్‌‌ నేపథ్యంలో ప్రసవంకోసం వచ్చిన మహిళకు వెంటనే వైద్యం చేయకుండా మరో ఆస్పత్రికి వెళ్లండని చేతులు దులిపేసుకున్న తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక అందజేయాలని జస్టిస్‌‌ ఎమ్మెస్‌‌ రామచందర్‌‌రావు, జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌లతో కూడిన బెంచ్  వైద్యారోగ్య శాఖను ఆదేశించింది.

రెడ్​జోన్లలో ప్రచారం చేయండి

రెడ్‌‌ జోన్లలో అంబులెన్స్‌‌ సేవల గురించి అక్కడి ప్రజలకు తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని జోనల్​ నోడల్​ ఆఫీసర్లకు సూచించింది. అత్యవసర వైద్యంకోసం బాధితులను తీసుకెళ్లే వాహనానికి పాస్​లు లేకపోయినా అడ్డుకోవద్దని పోలీసులను ఆదేశించింది. రెడ్​జోన్లలో నోడల్​ఆఫీసర్ ఫోన్‌‌ నెంబర్లను అక్కడి జనాలందరికీ తెలిసేలా ప్రచారంచేయాలని పేర్కొంది. జనీల మృతిపై వైద్యవిద్య డైరెక్టర్‌‌ విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించిందని ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ చెప్పారు. రిపోర్టు అందాక బాధితులపై చర్యలు, బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు.

సినిమా థియేటర్లు నాలుగు నెలల వరకు ఓపెన్ కావు