రిటైర్​మెంట్​ బెనిఫిట్స్​ చెల్లింపుల్లో జాప్యం ఎందుకు? : హైకోర్టు

 రిటైర్​మెంట్​ బెనిఫిట్స్​ చెల్లింపుల్లో జాప్యం ఎందుకు? : హైకోర్టు
  • ఇది రాష్ట్ర ఆర్థిక డొల్లతనాన్ని చాటుతుంది: హైకోర్టు
  • ఉచితాలపై ఆలోచించాల్సిన సమయమిదేనని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: రిటైర్ట్​ ఎంప్లాయిస్​కు గ్రాట్యుటీతోపాటు పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపుల్లో జాప్యంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.  చెల్లింపుల్లో వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక డొల్లతనాన్ని చాటుతుందని వ్యాఖ్యానించింది.   చెల్లింపుల్లో జాప్యానికి కారణాలు ఏవైనా కావచ్చని,  ఈ పరిస్థితి ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నది. ఉచితాలపై ఆలోచించాల్సిన సమయం ఇదేనని అన్నది. ఉద్యోగ విరమణ పొంది ఆరు నెలలైనా  ప్రయోజనాలు చెల్లించకపోవడాన్ని సవాల్​ చేస్తూ   రిటైర్డ్​ ఏఈ ఎ.నరేందర్‌‌‌‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ నగేశ్‌‌‌‌ భీమపాక విచారణ చేపట్టారు.

 పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌‌‌‌ 40 ఏండ్ల సర్వీసులో ఎలాంటి మచ్చ లేకుండా సేవలందించారన్నారు. ఉద్యోగ విరమణ చేసి 4 నెలలు అయినా, ఆగస్టులో టోకెన్‌‌‌‌ జారీచేసినా ఇప్పటివరకు సొమ్ము విడుదల చేయలేదని, గ్రాట్యుటీ చట్టం సెక్షన్‌‌‌‌ 3 ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపులో జాప్యం జరిగితే వడ్డీ చెలించాలన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలను వినిపిస్తూ చెల్లింపు ప్రక్రియ కొనసాగుతున్నదని, నిధుల కొరత వల్ల చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నదని చెప్పారు. 

ప్రయోజనాలు దాతృత్వం కాదు: జస్టిస్‌‌‌‌ నగేశ్‌‌‌‌ భీమపాక

ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ నగేశ్‌‌‌‌ భీమపాక కీలక వ్యాఖ్యలు చేశారు. పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జాప్యంపై రోజురోజుకూ పెరుగుతున్న పిటిషన్లను పరిశీలిస్తే ఆందోళన కలుగుతున్నదని అన్నారు.  ఈ పరిస్థితుల్లో కొన్ని వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించుకోలేక పోతున్నామని చెప్పారు.   అవిశ్రాంతంగా కష్టపడి పనిచేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి చేయూతనిస్తున్నారన్నారు.

 వ్యక్తిగత ఆనందాలను త్యాగం చేసి.. తమ ఆదాయంలో కొంత భాగాన్ని తమ పిల్లల విద్య, ఆరోగ్యం, సొంత భవిష్యత్తు భద్రత కోసం పొదుపు పాటిస్తారన్నారు. అవసరమైనప్పుడు నిధులు అందుబాటులో ఉంటాయన్న విశ్వాసంతో పొదుపులో కూడా ఎక్కువ భాగం సొమ్మును ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న పథకాల్లోనే దాచుకుంటారని చెప్పారు. గ్రాట్యుటీ, పదవీ విరమణ ప్రయోజనాలు దాతృత్వం కాదని, అవి ఏండ్ల తరబడి కష్టపడి, క్రమశిక్షణతో సంపాదించి దాచుకున్న సొమ్ము అని వ్యాఖ్యానించారు.

 ప్రాథమిక అవసరాలు కోసం దాచుకున్న సొమ్మును సకాలంలో విడుదల చేయకపోతే ఇబ్బందులు తప్పవని ప్రత్యేకంగా చెప్పాల్సినవసరంలేదని అభిప్రాయపడ్డారు.   సమాజంలోని ప్రజల శ్రేయస్సు కోసం అమలు చేసే ఉచితాలపై ఆలోచించాల్సిన సమయం ఇదేనని అభిప్రాయపడ్డారు. పిటిషనర్‌‌‌‌కు పదవీ విరమణ ప్రయోజనాలను రెండున్నర నెలల్లోపు చెల్లించాలని ఆదేశిస్తూ పిటిషన్‌‌‌‌పై విచారణను ముగించారు.