- కోర్టును తప్పుదోవ పట్టించినందుకు పిటిషనర్‌కు రూ. 10 వేల పెనాల్టీ
హైదరాబాద్, వెలుగు: న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రతి ఒక్కరికి తమ కేసుకు సంబంధించిన అన్ని నిజాలను వెల్లడించాల్సిన బాధ్యత ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. కీలకమైన విషయాలను దాచిపెట్టి పిటిషన్లు వేయడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని తెలిపింది. రిజిస్ట్రేషన్ లేని సాధారణ అమ్మకపు పత్రాల ఆధారంగా స్థిరాస్తులపై ఎలాంటి యాజమాన్య హక్కులు రావని తేల్చిచెప్పింది.
బంజారాహిల్స్‌లోని అత్యంత విలువైన ప్రభుత్వ భూమిపై హక్కు ఉందంటూ దాఖలైన ఒక రిట్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. తప్పుడు వివరాలతో కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు గానూ సదరు పిటిషనర్‌పై రూ.10 వేల జరిమానా విధించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-14 లో ఉన్న 4,865 చదరపు గజాల భూమి తనదేనని, ఆ భూమిలో ప్రభుత్వం అక్రమంగా జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ సయ్యద్ అబ్దుల్ ఖాలిద్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ లక్ష్మీ నారాయణ అలిశెట్టి ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. 1969 నాటి ఒక పత్రం ఆధారంగా ఆ భూమి తన క్లయింట్‌దేనని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. అయితే, ఈ వాదనలను ప్రభుత్వం ఖండించింది. వివాదాస్పద భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం 'సర్కారీ కంచ తత్తిఖానా'గా నమోదై ఉన్న ప్రభుత్వ భూమి అని కోర్టుకు వివరించింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికే పిటిషనర్ నకిలీ పత్రాలు సృష్టించారని ఆధారాలు సమర్పించింది.
కోర్టు ఆదేశాల ప్రకారం నిర్వహించిన సంయుక్త సర్వేలోనూ అసలు నిజాలు బయటపడ్డాయి. పిటిషనర్ చెప్తున్న భూమి సర్వే నంబర్-19 లో ఉండగా..ప్రభుత్వం బోర్డు ఏర్పాటు చేసిన స్థలం సర్వే నంబర్-17 లో ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ప్రభుత్వం పిటిషనర్ భూమిలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని స్పష్టమైంది. స్థిరాస్తులపై హక్కులు కేవలం చట్టబద్ధమైన రిజిస్టర్డ్ పత్రాల ద్వారానే బదిలీ అవుతాయని, నిజాలను దాచేవారికి ఎలాంటి ఉపశమనం లభించదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
తప్పుడు వివరాలతో కోర్టు సమయాన్ని వృథా చేసినందుకుగానూ పిటిషనర్‌కు రూ. 10 వేల జరిమానా విధించారు. ఆ మొత్తాన్ని రెండు వారాల్లో హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి చెల్లించాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు.
