అక్రమ నిర్మాణాలు పూర్తయ్యే దాకా కండ్లు మూసుకున్నరా ?: జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఆఫీసర్లపై హైకోర్టు ఫైర్

అక్రమ నిర్మాణాలు పూర్తయ్యే దాకా కండ్లు మూసుకున్నరా ?: జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఆఫీసర్లపై హైకోర్టు ఫైర్

హైదరాబాద్, వెలుగు: అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే చర్యలు తీసుకోకుండా కండ్లు మూసుకున్నారా అంటూ జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ అధికారులపై హైకోర్టు మండిపడింది. అక్రమ నిర్మాణాలు పూర్తయ్యాక అధికార దర్పం ప్రదర్శించడానికి చర్యలు తీసుకుంటారా అంటూ నిలదీసింది. అక్రమ నిర్మాణం అని తెలిసిన వెంటనే సెక్షన్‌‌‌‌‌‌‌‌ 461 కింద ఎందుకు సీజ్‌‌‌‌‌‌‌‌ చేయలేదని ప్రశ్నించింది.

జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ జారీ చేసిన కూల్చివేత నోటీసును సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటకు చెందిన కె.రఘువీర ఆచారి హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌ బి.విజయ్‌‌‌‌‌‌‌‌సేన్‌‌‌‌‌‌‌‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది వాదిస్తూ..బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌(బిల్డింగ్ రెగ్యులరైజేషన్  స్కీమ్) కింద దరఖాస్తు చేశామని, అది పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉండగా నోటీసు జారీ చేశారన్నారు.

దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. "జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలు కొనసాగుతుంటే చూస్తు ఉంటారు.  అన్నీ పూర్తయ్యాక నోటీసులు జారీ చేస్తారు. ఇలా మున్సిపల్‌‌‌‌‌‌‌‌ అధికారులు ఎందుకు చేస్తారో దేవుడు దిగివచ్చినా తెలుసుకోలేరు. షోకాజ్‌‌‌‌‌‌‌‌ నోటీసుతోపాటే అక్రమ నిర్మాణాలను సీజ్‌‌‌‌‌‌‌‌ చేయాలని గతంలో ఆదేశాలిచ్చాం. ఆ ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదు? ప్రతి జోన్, సర్కిల్‌‌‌‌‌‌‌‌లో అధికారులుంటారు.

మరి అక్రమ కట్టడాలు ఎలా కొనసాగుతున్నాయి ? ఇంటి పన్ను వసూలుకు మాత్రం వెళుతారుగానీ,  అక్రమ నిర్మాణం కనిపించదా? అక్రమ నిర్మాణాలు జరిగేటప్పుడు కండ్లు మూసుకుని.. తరువాత తమ అధికారం చెలాయించడానికి నోటీసు జారీ చేస్తారు" అంటూ హైకోర్ట్ ఫైర్ అయింది.  జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ జారీ చేసిన నోటీసుపై యథాతథస్థితి ఉత్తర్వులు కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.